దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన గర్బా వేడుకలో విషాదం చోటు చేసుకుంది. కూతురిని వేధించిన యువకులతో ఘర్షణకు దిగిన వ్యక్తి వారి దాడిలో మృతి చెందాడు.
ఫరీదాబాద్ : హర్యానాలో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో గర్బా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఓ అమ్మాయిని ఇద్దరు యువకులు వేధించారు. దీంతో ఆ అమ్మాయి తండ్రి 52 ఏళ్ల వ్యక్తి తన కుమార్తెను వేధించిన ఇద్దరు వ్యక్తులతో గొడవకు దిగాడు. ఇది చివరికి అతని మరణానికి దారితీసింది అని పోలీసులు తెలిపారు.
సోమవారం రాత్రి ఫరీదాబాద్ సెక్టార్ 86లోని ప్రిన్సెస్ పార్క్ సొసైటీలో జరిగిన గర్బా కార్యక్రమంలో ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సొసైటీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అతని కుమార్తె వద్దకు వచ్చి ఆమె కాంటాక్ట్ నంబర్‌ను అడిగారు. దాండియా కార్యక్రమంలో కూడా వారు అనుచితంగా బాలిక చేతిని తాకినట్లు బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది చిన్నారులకు గాయాలు
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం సందర్భంగా ఆ వ్యక్తి తోసుకుంటూ స్పృహతప్పి నేలపై పడిపోయాడు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో గార్బా కార్యక్రమంలో ఇరువర్గాల వారు కాలర్‌లు పట్టుకుని ఒకరినొకరు నెట్టుకుంటున్న వీడియో కూడా వెలుగు చూసింది.
అతను కిందపడడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దర్యాప్తు అధికారి జమీల్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.