సిగరెట్ ఇవ్వలేదని కాల్పులు జరిపిన టూరిస్టు.. షిమ్లా రెస్టారెంట్‌లో ఘటన

By Mahesh KFirst Published Sep 20, 2022, 4:53 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గెస్టుగా దిగిన విశ్వనాథ్ అర్ధరాత్రి తనకు సిగరెట్లు కావాలని వెయిటర్‌కు హుకూం జారీ చేశాడు. కానీ, బిజినెస్ అవర్స్ ముగిశాయని, ఇప్పుడు సిగరెట్లు తీసుకురావడం కుదరదని వెయిటర్ వివరించాడు. దీంతో వెయిటర్‌పై ఆగ్రహంతో విశ్వనాథ్ గన్ తీసి గాలిలో కాల్పులు జరిపాడు.

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో ఓ రెస్టారెంట్‌లో టూరిస్టు భయాందోళనలు సృష్టించాడు. సిగరెట్ తీసుకురావాలని ఆదేశిస్తే.. వెయిటర్ అందుకు నిరాకరించాడని ఆ టూరిస్టు గన్ తీసి గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో రెస్టారెంట్ మొత్తం భయానక వాతావరణం కమ్ముకుంది. ఈ ఘటనలో ప్రాణ హాని జరగలేదు.

ఛోటా షిమ్లాలో ఉన్న ఓ హోటల్‌లో విశ్వనాథ్ అనే వ్యక్తి దిగాడు. కొన్నాళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెయిటర్‌ను పిలిచాడు. తనకు సిగరెట్లు తేవాల్సిందిగా ఆదేశించాడు. కానీ, వెయిటర్ అందుకు తిరస్కరించాడు. బిజినెస్ అవర్లు ముగిశాయని, కాబట్టి, సిగరెట్లు ఇప్పుడు తీసుకురావడం కుదరదని వెయిటర్ చెప్పాడు.

ఈ సమాధానంతో విశ్వనాథ్ శివాలెత్తాడు. వెయిటర్ పై ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తన దగ్గర ఉన్న వెపన్ తీసి రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత విశ్వనాథ్ డోర్ లాక్ చేసుకుని అందులోనే ఉండిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించి ప్రైవేట్ హోటల్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ హోటల్‌లో ఉంటున్న ఓ గెస్టు రాత్రిపూట తన వెపన్‌తో రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపాడని ఆరోపించారు. ఆ తర్వాత హోటల్ రూమ్‌లోనే తాళం వేసుకుని ఉన్నాడని పేర్కొన్నట్టు షిమ్లా ఎస్పీ మోనికా భూతుంగ్రు వివరించారు.

విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. 

click me!