పంజాబ్ సీఎం లిక్కర్ తాగి ఫ్లైట్ ఎక్కాడా? దర్యాప్తు చేస్తాం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

By Mahesh KFirst Published Sep 20, 2022, 3:43 PM IST
Highlights

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో లిక్కర్ తాగి విమానం ఎక్కారని, నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఫ్లైట్ నుంచి దింపేయడం వల్ల ఆ విమానానికి నాలుగు గంటలు జాప్యం ఏర్పడిందని సోమవారం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను ఆప్ కొట్టిపారేసింది. కానీ, ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని పౌర విమానయాన శాఖ పేర్కొంది.
 

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి ఫ్లైట్ ఎక్కాడని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ వర్సెస్ ఆప్‌గా మారాయి. ఈ ఆరోపణలను ఆప్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దీనిపై రచ్చ ఆగలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఫ్లైట్ నాలుగు గంటలు ఆలస్యంగా బయల్దేరిందని, లిక్కర్ తాగి ఫ్లైట్ ఎక్కిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కిందికి దింపడంలో జాప్యం జరిగిందని ఆ ఆరోపణలు పేర్కొన్నాయి.

ఈ ఆరోపణలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రియాక్ట్ అయ్యారు. అది విదేశంలో జరిగిన దానికి సంబంధించిందని వివరించారు. కాబట్టి, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిజా నిజాలను నిర్దారించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.  లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ అందించిన డేటా పైనే ఆధారపడతామని చెప్పారు. తమకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాము ఈ ఘటనను విచారిస్తామని పేర్కొన్నారు.

ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరినా లుఫ్తాన్సా విమానం ఆలస్యంగా బయల్దేరిందని పేర్కొన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తాగి విమానం ఎక్కాడని, కనీసం స్వయంగా నడిచే స్థితిలోనూ లేడని ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయనను ఫ్లైట్ నుంచి దింపేశారని ఆరోపించారు.

దీంతో జర్మనీకి చెందిన ఆ ఎయిర్‌లైన్ ఓ ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. ఆ విమానం జాప్యం జరిగిన మాట నిజమేనని, అయితే, ఇన్‌బౌండ్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌క్రాఫ్ట్ చేంజ్ కారణంగా ఈ ఆలస్యం ఏర్పడిందని తెలిపింది.

లిక్కర్ తాగి విమానం ఎక్కిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఫ్లైట్ నుంచి దింపేశారని, ఈ కారణంగా లుఫ్తాన్సా విమానానికి నాలుగు గంటలు ఆలస్యం అయిందని శిరోమణి నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు. అందువల్లే ఆయన ఆప్ జాతీయ సదస్సులోనూ హాజరు కాలేకపోయాడని పేర్కొన్నారు. ఈ కథనాలు అంతర్జాతీయంగా పంజాబీలను అగౌరవపరిచేలా ఉన్నదని ఆరోపించారు.

కాగా, ఈ ఆరోపణలన్నీ నిరాధారాలని ఆప్ చీఫ్ స్పోక్స్‌పర్సన్ మాల్వింద్ర సింగ్ కాంగ్ కొట్టిపారేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ ప్రతిష్ట దిగజార్చాలని జరుగుతున్న నెగెటివ్ ప్రాపగాండ అని పేర్కొన్నారు.

click me!