
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)గా దిగిపోనున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించారు. తనను తాను సమర్థించుకుంటూ లైంగికపరమైన ఉద్దేశాలు, బలప్రయోగం లేకుండా మహిళను తాకడం లేదా హగ్ చేసుకోవడం నేరమేమీ కాదు అని అన్నారు. కొందరు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు జోక్యంతో కేసు నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న డిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ వాదనలు వినిపించారు.
బీజేపీ ఎంపీ పై చేసిన ఆరోపణలు అర్థం లేదని, ఎందుకంటే వారు కొన్నేళ్లు గడిచాక ఈ విషయాన్ని ముందుకు తీసుకువచ్చారని, ఈ జాప్యానికి కెరీర్ అనే భయం తప్పితే బలమైన కారణమేదీ వారు చెప్పకపోవడం గమనార్హం అని ఆయన తెలిపారు.
ఢిల్లీలోని అశోకా రోడ్, సిరి ఫోర్ట్ ఆడిటోరియంలలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనను 20 నుంచి 25 సెకండ్ల పాటు హగ్ చేసుకున్నాడని ఆయనపై ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ.. ఈ రెండు ఆరోపణలు అశోకా రోడ్డు, సిరి ఫోర్ట్‌లకు సంబంధించినవనీ, సిరి ఫోర్ట్ దగ్గర చేసిన నేరం హగ్ అని ఫిర్యాదును రాజీవ్ మోహన్ గుర్తు చేశారు. కానీ, నేరపూరిత బలప్రయోగం, లైంగిక ఉద్దేశాలు లేనప్పుడు మహిళను తాకడం నేరం కాదని వాదించారు.
అంతేకాదు, మరో కీలక వ్యాఖ్య ఆయన చేశారు. మంగోలియా, జకార్తాలలో కొన్ని ఘటనలు జరిగినట్టు ఆరోపించారని, అవి ఇండియాలో జరగలేవు కాబట్టి, ఇక్కడ విచారించరాదని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ముందు అడ్వకేట్ రాజీవ్ మోహన్ వాదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, నేరం ఎక్కడ జరిగితే అక్కడే విచారించాలని రూల్ ఉన్నదని వివరించారు. అంతేకాదు, ఈ ఆరోపణలు ఇప్పుడే చేయడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.
Also Read: Asian Champions Trophy: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. 4-0తో చెలరేగిన హాకీ టీమ్
2023లో చేసిన ఫిర్యాదు ప్రకారం 2017, 2018లలో ఈ ఘటనలు జరిగాయని తెలుస్తుందని, ఇన్నాళ్లు ఈ ఘటనలపై ఫిర్యాదు చేయడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. తమ కెరీర్ అనే భయం మినహా అసలేమీ పెద్ద కారణం లేదని వివరించారు. కర్ణాటకలోని బళ్లారీ లేదా లక్నోలో నమోదైన ఫిర్యాదులపై ఢిల్లీలో విచారణ చేపట్టరాదనీ అన్నారు. కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.