ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్తపై విష ప్రయోగం

By telugu news teamFirst Published Jan 6, 2021, 11:37 AM IST
Highlights

2017 జులైలో తనపై ప్రాణాపాయం కలిగించే స్థాయిలో రసాయనిక ప్రయోగం జరిగిందని తపన్ తెలిపారు. దోసెతో పాటూ తెచ్చిన చట్నీలో దీన్ని కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా పై విషయం ప్రయోగం జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా.. సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మూడు సంవత్సరాల క్రితం తనపై విష ప్రయోగం చేశారంటూ ఆయన చేసిన కామెంట్స్.. ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చాలా కాలం పాటు తాను ఈ విషయాన్ని రహస్యంగా ఉంచానని చెప్పిన ఆయన.. తాజాగా.. అందరికీ తెలియజేస్తున్నట్లు చెప్పారు.

‘సుదీర్ఘ కాలం దాచి ఉంచిన రహస్యం’ పేరిట పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఈ సంచలన విషయాన్ని తెలిపారు. తపన్ మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. 

2017 జులైలో తనపై ప్రాణాపాయం కలిగించే స్థాయిలో రసాయనిక ప్రయోగం జరిగిందని తపన్ తెలిపారు. దోసెతో పాటూ తెచ్చిన చట్నీలో దీన్ని కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగా తాను అనారోగ్యం పాలయ్యాయని, ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డానని తపన్ తెలిపారు. చర్మంపై చిన్న బొడిపెలు రావడంతో పాటూ అరచేతిపై చర్మం పెచ్చులుగా ఊడిపోయిందని అన్నారు. 

తనపై ఆర్సెనిక్‌ అనే రసాయన ప్రయోగం జరిగినట్టు ఎయిమ్స్ రిపోర్టును కూడా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో జత చేశారు. ‘గూఢచర్య ఆపరేషన్‌లో భాగంగా..మిలిటరీ, వ్యాపార రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ శాస్త్రవేత్తను తొలగించడమే ఈ దాడి వెనుక కారణం అయి ఉండొచ్చు’ అని తపన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కూడా ఆయన కోరారు. తపన్ మిశ్రా గతంలో ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. 

 

click me!