Today Top Story: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..క్రిమినల్ చట్టలకు రాజ్యసభ ఆమోదం.. వన్డే సిరీస్ భారత్ కైవసం

By Rajesh Karampoori  |  First Published Dec 22, 2023, 5:43 AM IST

Today Top 10 Telugu Lastest News: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీలో తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు..తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. జమ్మూలో ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు హతం, లక్ష్య చేధనలో కుప్పకూలిన సౌతాఫ్రికా వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్‌.. క్రిమినల్ చట్టలకు రాజ్యసభలో ఆమోదం వంటి పలు వార్తల సమాహారం.  


Today Top 10 Telugu Lastest News: 

తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. 

Latest Videos

కరోనా కొత్త వేరియంట్ జేన్.1 భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల పెరుగుదల వేగం పుంజుకుంది. తాజాగా తెలంగాణలో కొత్తగా మరో 6 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకుంది. అదే సమయంలో కోవిడ్ నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కేసులు వెలుగుచూసినట్లుగా వార్తలు రావడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఈ వార్తలు అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. భూపాలపల్లికి చెందిన ఓ మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎంలోని కోవిడ్ వార్డులో చేరిందని, అలాగే.. మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా గుర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంలో 50 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. 

 
తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా.. 

తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా.. సెలవు దినాలు మినహాయిస్తే మొత్తం 6 రోజుల పాటు సభ జరిగింది. ఆరు రోజుల 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేయగా..  రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. ఇకపోతే.. ఇవాళ జరిగిన అసెంబ్లీ సెషన్‌లో యాదాద్రి ప్రాజెక్ట్, ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్ట్‌లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి .. స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డి సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. 24 గంటల విద్యుత్‌పై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 


ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి.. నేలకొరిగిన నలుగురు జవాన్లు


Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కు, జిప్సీపై మెరుపుదాడి చేశారు. జిల్లాలోని డోనాడ్ ప్రాంతంలోని థానామండి-బఫ్లియాల్ రహదారిపై వెళ్తున్న సైనిక వాహనాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత సైనికులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రతీకార దాడికి దిగారు.  నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి.


‘క్రిమినల్‌’ బిల్లులకు రాజ్యసభ ఆమోదం..  
 
Parliament Session:బ్రిటిష్‌ వలస పాలన నాటి క్రిమినల్‌ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం  మూడు కీలక బిల్లులకు తీసుకవచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్ (IPC)1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) 1873, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం 1872 స్థానంలో మూడు క్రిమినల్ బిల్లులను తీసుకవచ్చింది. ఆ బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) బిల్లులు ఆమోదించబడ్డాయి. హోం మంత్రి అమిత్ షా చర్చ తర్వాత, రాజ్యసభ మూజువాణి ఓటు ద్వారా మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. వాటిని లోక్‌సభ ఇప్పటికే ఆమోదించింది. అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎగువ సభ నుండి 46 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన సమయంలో ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి. 

లక్ష్య చేధనలో కుప్పకూలిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్ భారత్‌దే 

IND vs SA: కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. గురువారం (డిసెంబర్ 21) జరిగిన సిరీస్‌లోని మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 78 పరుగుల తేడాతో ఓడించింది. రాహుల్ కెప్టెన్సీలోనే 2022లో టీమిండియా ఓడిపోయింది. అప్పుడు దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలిచింది. రాహుల్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా భారత్ ఓడిపోయింది. ఆ పర్యటనలో అతని నాయకత్వంలోని నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయిన రాహుల్ కెప్టెన్‌గా అద్భుతంగా పునరాగమనం చేశాడు.  ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 296 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది.

click me!