Top Stories: నేడు ఆదిలాబాద్‌కు మోడీ, జగన్‌కు భారీ ఓటమన్న పీకే, ‘ఇండియా’ కూటమి ఎన్నికల భేరి

By Mahesh K  |  First Published Mar 4, 2024, 5:56 AM IST

నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజ ఆదిలాబాద్‌కు విచ్చేస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో ఆయన సుమారు రూ. 15 వేల కోట్ల అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయం అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు.
 


ఆదిలాబాద్‌కు మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం ఆదిలాబాద్‌కు రానున్నారు. సోమవారం, మంగళవారాల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్వాగతించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రూ. 15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలను చేపట్టనున్నారు. ఆదిలాబాద్‌లో సుమారు రూ. 6,700 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన తమిళనాడుకు వెళ్లుతారు. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రాజ్ భవన్‌లో బస చేస్తారు. మరుసటి రోజు సంగారెడ్డిలో నిర్వహించే సభలో పాల్గొంటారు.

Latest Videos

జగన్‌కు ఓటమి: ప్రశాంత్ కిశోర్

ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్‌లో జరిగిన ఓ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, జగన్ ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని దాని వల్ల ఓట్లు పడవన్నారు.  తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణమన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమన్న పీకే.. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి ఏం చేసినా జగన్ గెలవడం కష్టమని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.

‘ఇండియా’ కూటమి ఎన్నికల భేరి

ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం ఎన్నికల సమరభేరి మోగించింది. పట్నాలో భారీ స్థాయిలో జనవిశ్వాస్ మహా ర్యాలీ నిర్వహించింది. బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా జన విశ్వాస్ మహా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ముగింపు సందర్భంగా ఆర్జేడీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా సమాజ్‌వాదీ పార్టీ, డీ రాజా, దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. నితీశ్ కుమార్‌పై ఖర్గే, లాలు యాదవ్‌లు మండిపడ్డారు.

పాక్ ప్రధానిగా షహబాజ్

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా రెండో సారి షహబాజ్ షరీఫ్ మరోసారి ఎన్నికయ్యారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 మంది సభ్యుల పార్లమెంటులో షహబాజ్‌కు 201 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థిగా పీటీఐ అభ్యర్థి ఒమర్ ఆయూఖాన్ 92 ఓట్లతో నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు: కేసీఆర్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ క్యాంపెయిన్ పై ఫోకస్ పెడుతున్నది. ఈ ెల 12వ తేదీన కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టాలని అనుకుంటున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలువాలనే ప్రజలు అనుకున్నారని, కానీ, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వల్లే మెజార్టీ సీట్లు గెలుచుకోలేకపోయామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఫలితాలను ఫట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ అని తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి సెగ్మెంట్ల పార్టీ ముఖ్య నాయకులతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు చెప్పారు.

నేటీ నుంచి దరఖాస్తుల స్వీకరణ

సీఎం రేవంత్ రెడ్డి సుమారు 11 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తులను ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తవారు మాత్రం తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

click me!