Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ ఎంతంటే ?, జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు..టీడీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమే!.. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..? బీజేపీ విజయ సంకల్ప యాత్ర షూరు.. ,తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం, ’బీఆర్ఎస్ పార్టీని డిస్‌క్వాలి చేయండి?’, కర్నూల్ ఈనాడు పత్రిక కార్యాలయం మూకదాడి.. , అన్ని ఆర్కే డ్రామాలు..: మాజీ మంత్రి జవహర్, #GameChanger ‘గేమ్ ఛేంజర్’కథ ఆయన లైఫ్ స్టోరీయేనా?, India-UK: భారత యువతులకు బ్రిటన్ బంపరాఫర్.. వంటి వార్తల సమాహారం.
Today's Top Stories:
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
తెలంగాణ రాష్ట్రం నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారంనాడు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రెండు, బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్ పదవీకాలం పూర్తి కావడంతో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సమయంలో మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు నామినేషన్లను సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి , అనిల్ కుమార్ యాదవ్ లు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
బీజేపీ విజయ సంకల్ప యాత్ర షూరు..
BJP Vijaya sankalp Yatra: రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో మంగళవారంనాడు విజయ సంకల్ప యాత్రలను బీజేపీ ప్రారంభించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు ఒక్కటేనన్నారు. ప్రపంచమంతా బీజేపీ వైపు చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు కుటుంబ పార్టీలేనని ఆయన విమర్శించారు. ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తుందన్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అన్నవారిని చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ చెప్పారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
’బీఆర్ఎస్ పార్టీని డిస్‌క్వాలి చేయండి?’
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని కాగ్ రిపోర్టులో వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ను ఆధారం చేసుకుని కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు ఈసీకి లేఖ రాశారు. ఈ రుణాల చెల్లింపు పూర్తయ్యే దాకా లేదా 2035-36 వరకు బీఆర్ఎస్ పార్టీపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి, అవకతవకల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నీటి యుద్ధం చేసింది. ఇటీవలే కాగ్ విడుదల చేసిన రిపోర్ట్ కూడా బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉన్నది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ఆర్థిక పరమైన అవకతవకలు ఉన్నాయని కాగ్ పేర్కొంది. ప్రజల్లో ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయడమే కాదు.. న్యాయపరమైన చిక్కులను తెచ్చేలా ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు.
కర్నూల్ ఈనాడు పత్రిక కార్యాలయం మూకదాడి..
Kurnool: కర్నూల్ లోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయంపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడులకు దిగారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అనుచరులు భారీగా చేరుకుని ఆఫీస్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం కార్యాలయ తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో ఈనాడు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపిస్తూ.. దుండగులు కార్యాలయంపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
టీడీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమే!..
టీడీపీ త్వరలోనే ఎన్డీయే చేరడం ఖాయంగా ఉన్నది. సీట్ల కేటాయింపులపై చర్చ జరుగుతున్నది. బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య పొత్తుకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరు వరకు కసరత్తు పూర్తికానుంది. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ త్వరలోనే ఎన్డీయే కూటమిలో చేరనుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో తెలుగు దేశం పార్టీ చేరడం దాదాపు ఖాయం అయింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల కేటాయింపులపై చర్చ మాత్రమే మిగిలి ఉన్నది. ఈ సీట్ల కేటాయింపులపైనా చర్చలు వేగం అందుకున్నాయి. టీడీపీ సారథ్యంలో ఈ కూటమి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగితే.. 2014లో మాదిరిగానే ఈ సారి కూడా బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకోగలమనే ఆశలో ఉన్నది.
అన్ని ఆర్కే డ్రామాలు..: మాజీ మంత్రి జవహర్
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల తన వైఎస్సార్టీపీని ఏపీ కాంగ్రెస్‌లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆర్కే కూడా హస్తం గూటికి వెళ్లారు. తాజాగా, మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ పరిణామంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు జవహర్ స్పందిస్తూ ఆర్కేపై మండిపడ్డారు. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఆ డ్రామాల్లో భాగంగానే ఆయన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వద్దకు వెళ్లారని అని పేర్కొన్నారు. ఇక వైసీపీలోకి మళ్లీ రావడం మరో డ్రామా అని విమర్శించారు. ఆర్కే డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు జవహర్ ఫైర్ అయ్యారు. అందులో భాగంగానే షర్మిల వద్దకు వెళ్లారని అన్నారు. వైసీపీలోకి రావడం మరో డ్రామా అని మండిపడ్డారు. ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
Lok Sabha Elections: ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..?
Lok Sabha Election: సార్వత్రిక ఎన్నికల సమరానికి భారత్ సిద్దమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. లోకసభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే ఈసీ పలు రాష్ట్రాల్లో పర్యటన చేసింది. ఈ క్రమంలో మార్చి 8 , 9 తేదీలు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు బలగాలపై ఆ సమావేశంలో కీలకంగా ప్రస్తవించనుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది.
Passports Ranking: భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ ఎంతంటే ?
Passport Ranking: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 (Henley Passport Index) విడుదల చేయబడింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రెంచ్ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 194 దేశాలకు ప్రయాణించవచ్చు. ఫ్రాన్స్ తర్వాత స్థానంలో జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ నిలిచాయి. కాగా.. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారత్ అధ్వాన్నంగా ఉంది. గతేడాది ఇండియా పాస్‌పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ఈ ఏడాది అది 62కు పెరిగినా ర్యాంకు మాత్రం పడిపోయింది. దీంతో భారతీయ పాస్‌పోర్ట్ ఒక స్థానం దిగజారి 85వ స్థానానికి చేరుకుంది.
జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు..
Jayalalitha: తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన 27 కిలోల బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలో విచారణ జరిగింది. ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబ సభ్యులకు అర్హత లేదని గతంలో కోర్టు తేల్చి చెప్పింది. జయలలిత మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆభరణాలను వేలం వేసే బదులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తే బాగుంటుందని కోర్టు పేర్కొంది.
#GameChanger ‘గేమ్ ఛేంజర్’కథ ఆయన లైఫ్ స్టోరీయేనా?
GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది. ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. అయితే..మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన టి. ఎన్. శేషన్. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలను నిర్వహించేందుకు శేషన్ అనేక చర్యలు తీసుకున్నారు. వీటిలో కొన్ని ఏమిటంటే, అర్హులైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించడం, ప్రగతిశీలమైన, స్వతంత్ర ఎన్నికల కమిషన్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణకు ఇతర రాష్ట్రాల అధికారులను నియమించడం వంటివి చేసారు. ఆయన జీవిత విశేషాలను ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
India-UK: భారత యువతులకు బ్రిటన్ బంపరాఫర్..
India-UK Young Professionals Scheme: భారతీయ యువతకు బ్రిటన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. యూకేకు వెళ్ళి అక్కడే చదువుకోవడానికి, పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. బ్రిటన్-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద మూడు వేల మంది భారతీయ యువతకు బ్రిటన్ వెళ్లే అవకాశం లభిస్తుంది. ఈ పథకం కింద భారతదేశంలోని ప్రతిభావంతులైన యువతకు బ్రిటన్ సర్కార్ వీసా అందిస్తుంది.