Today's Top Stories: నీకు చేతకాకుంటే తప్పుకో.. ఢిల్లీ మెట్రో సరికొత్త రికార్డు.. మళ్లీ రోహిత్ కే పట్టం..   

By Rajesh Karampoori  |  First Published Feb 15, 2024, 8:17 AM IST

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ, అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోడీ, బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులు వీరే.., నీకు చేతకాకుంటే తప్పుకో.. నేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా : హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ .. ఈ కొత్త వాదన వెనుక వైసీపీ ఎత్తుగడ?, ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ,  రోహిత్ కే పట్టం కట్టిన బీసీసీఐ వంటి వార్తల సమాహారం. 


Today's Top Stories:

ఢిల్లీ మెట్రో సరికొత్త రికార్డు

Latest Videos

తాజాగా ఓ ఢిల్లీ మెట్రో సరికొత్త రికార్డును క్రియేట్ అయ్యింది. ఒక్కరోజు ఏకంగా 71 లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. ఇది దేశ మెట్రోలోనే సరికొత్త రికార్డు. ఈ రికార్డును ఢిల్లీ మెట్రో సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 13న ఢిల్లీ మెట్రో చరిత్రలోనే అత్యధికంగా ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ మెట్రో రైళ్లలో 71.09 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.  

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అయింది. ఇప్పటికే సోనియా గాంధీ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, అభిషేక్ మను సింఘ్వీ, చంద్రకాంత్ హాండర్ లను నలుగురు అభ్యర్థులుగా ఆయా రాష్ట్రాల నుంచి ప్రకటించింది. కాగా, మొత్తం 15 రాష్ట్రాల్లోనే 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే చివరి తేదీ ఫిబ్రవరి 15. ఇప్పటికే బిజెపి, టీఎంసీ, బీజేడీ సహా అనేక పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. 


అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోడీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం మధ్యప్రాచ్యం, యూఏఈలోని హిందూ జనాభాకు అతి ముఖ్యమైనది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.  2015లో యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబు మ్రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో మరో 13.5 ఎకరాల భూమిని విరాళం ఇవ్వగా.. ఆలయ నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది.  ఇది అబుదాబిలోని మొట్టమొదటి  రాతితో నిర్మించిన హిందూ దేవాలయం.

బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర ..

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఆయన 20 నెలల పాటు కొనసాగారు. 2022 మే 30న తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు రవిచంద్ర. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 2న ముగియనుంది. తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు రాజ్యసభ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 

నీకు చేతకాకుంటే తప్పుకో.. నేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా : హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు చేతకాకుంటే పదవి నుంచి దిగిపోవాలని.. తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తానని హరీశ్ వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డను సీఎం రేవంత్ రెడ్డి బాగు చేయలేమని అంటున్నారని మండిపడ్డారు. తాను సీఎంగా బాధ్యతలు తీసుకుని నీళ్లు కూడా ఎత్తిపోస్తానని హరీశ్ రావు పేర్కొన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులు వీరే


తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లను ఎంపిక చేసింది. అలాగే మధ్యప్రదేశ్ , కర్ణాటకల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో అశోక్ సింగ్ , కర్ణాటకలో అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్‌లను ఎంపిక చేసింది. రేపు వీరంతా నామినేషన్లు వేయనున్నారు. 

చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు

ఉత్త పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్,బిజెపి వదినమ్మ పురందీశ్వరి, కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిల... వీరందరినీ వెంటపెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వస్తున్నారంటూ మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేసారు. అందరూ కలిసి కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని ... వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం ప్రారంభించారని కొడాలి నాని అన్నారు. 


ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ .. ఈ కొత్త వాదన వెనుక వైసీపీ ఎత్తుగడ?  

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. విశాఖలో ఏపీ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కంటిన్యూ చేయాలని ఆయన ఓ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం వైసీపీని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇలాంటి దశలో వైవీ సుబ్బారెడ్డి ఈ కొత్త వాదనను తెరపైకి తీసుకురావడం తెలుగు ప్రజలను ఆశ్చర్చానికి గురిచేసింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజన విభజిస్తూ పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వుంటుందని పేర్కొన్నారు. 


ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్దినెలల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ , జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఎస్పీలకు తోడు చిన్నా చితకా పార్టీలు బరిలో నిలవనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో తలమునకలై వున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పాటైంది. బుధవారం గుంటూరు బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభల ఏర్పాటు చేసిన విజయ్ కుమార్ ‘‘ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ’’ పేరును ప్రకటించారు


అలాచేస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ చావు ఖాయం... : ఎలాన్ మస్క్ సంచలనం 

ప్రపంచ కుబేరుడు, స్పెస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బలమైన సైన్యం కలిగిన రష్యా చిన్నదేశమైన ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ రష్యా వెనక్కితగ్గితే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అంతమయ్యే అవకాశాలున్నాయన్నారు. కాబట్టి యుద్దాన్ని కొనసాగించడం తప్ప పుతిన్ వద్ద మరో ఆప్షన్ లేదని మస్క్ పేర్కొన్నారు.  


రోహిత్ కే పట్టం కట్టిన బీసీసీఐ
 
T20 World Cup 2024:టీ-20 ప్రపంచకప్‌ కోసంక్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వెస్టిండీస్‌-అమెరికా జట్ల వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఎవరు సారథ్యం వహిస్తారనే విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు జై షా స్పష్టతనిచ్చేశారు. టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మనే కెప్టెన్‍గా ఉంటాడని జై షా స్పష్టం చేశారు. అతడి సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ పోరులో దిగుతుందనీ, టైటిల్ ను  భారత్ కైవసం చేసుకుంటుందనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని తెలిపారు. ఈ టీ-20 ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని  బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు

click me!