Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో బీఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభ,పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తాం- జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు, 21 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర..,బీజేపీకి బిగ్ షాక్.. బాబు మోహన్ రాజీనామా.., అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.., ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ , జగన్ పథకాలు కొనసాగిస్తాం..: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, హాట్ టాపిక్ గా చంద్రబాబు ఢిల్లీ టూర్.. టీడీపీ-జనసేన-బీజేపీ కొత్త పొత్తుపొడుస్తుందా?, శరద్ పవార్ పార్టీకి పేరు ఖరారు. ప్రపంచ నంబర్.1 బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా..వంటి వార్తల సమాహారం.
Today's Top Stories:
బీఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
Congress Vs BRS: పార్లమెంట్ ఎన్నికల ముందే తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా నల్గొండ మారుతున్నది. ఈనెల 13న నల్గొండ (Nalgonda)లో బీఆర్‌ఎస్ (BRS) భారీ బహిరంగ నిర్వహిస్తున్న ప్రకటించింది. ఆ సభలో కృష్ణా జలాలకు సంబంధించి అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తామని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నీటి పారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పినట్టు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపించింది.
పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
CM Revanth: పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధం కావాలని ఆదేశిస్తూ, 15 వేల పోలీసు ఉద్యోగ ఖాళీల భర్తీకి మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
Shab e meraj: తెలంగాణలో నేడు పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విద్యార్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు అని తెలిపింది. రేపు ముస్లింలకు పవిత్రమైన షబ్ ఎ మెరాజ్ పండుగ. ఈ పండుగ సందర్భంగానే ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులనూ జారీ చేసింది.
20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తాం- జగ్గారెడ్డి
20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా వున్నారని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేల వద్ద కేసీఆర్ కాపలాగా వున్నా.. లాగేస్తామని, ప్లాన్ రెడీ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి చెందకుండా కేసీఆర్ , జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపే వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన మధ్య ఎంతో వ్యత్యాసం వుందని.. బీఆర్ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని, ఇంటి నుంచి పాలన చేసేవారని దుయ్యబట్టారు. మోడీ కనుసన్నల్లోనే జగన్, కేసీఆర్ పనిచేస్తున్నారని.. తెలంగాణ అభివృద్ధి చెందకుండా కేసీఆర్ , జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
21 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర..
Sammakka Sarakka Jatara: రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఈ నెల 21వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు సాగనుంది. 1998లో అధికారిక పండుగగా ప్రకటించిన ఈ సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతుంది. మేడారం గ్రామం జనాభా సుమారు 300 ఉంటుంది. కానీ, ఈ జాతరకు సుమారు 1.2 కోట్ల మంది భక్తులు వస్తారని ఒక అంచనా. తెలంగాణ, ఏపీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఈ గిరిజన జాతరకు వస్తారు.
బీజేపీకి బిగ్ షాక్.. బాబు మోహన్ రాజీనామా..
భారతీయ జనతా పార్టీకి మాజీ మంత్రి బాబు మోహన్ బుధవారం నాడు రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించారు. పార్టీ పెద్దలకు రాజీనామా లేఖను రేపు పంపుతానని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నుండి తనను పార్టీకి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కోసం తాను చాలా కష్టపడినట్టుగా ఆయన గుర్తు చేశారు.తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలలో తిరిగి ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.పార్టీ నేతలు కొందరు తనను అవమానించారని ఆరోపించారు.ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి..
హైదరాబాద్ : అమెరికాలో భారతీయ విద్యార్థుల మీద దాడులు ఆగడం లేదు. గతవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. తాజాగా చికాగోలో ఓ భారతీయ విద్యార్థి దొంగల దాడికి గురయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా.. సహాయం కోసం అర్థిస్తున్న వీడియో వైరల్ గా మారింది. నలుగురు దుండగులు అతనిని వెంటాడడం.. ఆ తరువాత రక్తం కారుతూ సహాయం కోసం అర్థించడానికి సంబంధించిన వీడియోలు వెలుగు చూశాయి.
ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం నాడు ప్రవేశ పెట్టారు. రూ.2,86,389 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి.రెవిన్యూ వ్యయం రూ. 2,30,110 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడి వ్యయం రూ. 30, 530 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వ మూల ధన వ్యయం 30,558 .18 కోట్లు, రెవిన్యూలోటు రూ.24,758 .22 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817.50 కోట్లు, జీఎస్‌డీపీ ద్రవ్యలోటు 3.51 శాతంగా నమోదైంది. రెవిన్యూల్ లోటు 1.56 శాతం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.
జగన్ పథకాలు కొనసాగిస్తాం..: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే పథకాలు ఆగిపోతాయంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ బుధవారం రూ.5 లక్షల బీమా చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఏ పథకం ఆగదని, మరింత సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మరింతగా అందజేస్తామే తప్పించి.. ఏ పథకం ఆగదని జనసేనాని స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
హాట్ టాపిక్ గా చంద్రబాబు ఢిల్లీ టూర్..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త పొత్తులు, సరికొత్త ఎత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు టిడిపి- జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలం నుంచి బీజేపీ కూడా టిడిపి-జనసేన కూటమితో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం నాడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం, అమిత్ షా తో భేటి అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు నాయుడు రాత్రికి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు, అమిత్ షాతో పాటు జెసి నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
శరద్ పవార్ పార్టీకి పేరు ఖరారు..
NCP Sharad Chandra Pawar : మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక వర్గమైన అజిత్ పవార్ గ్రూపునే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గానికి కొత్త పేరును కేటాయించింది ఈసీ. ‘‘ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ .. శరద్ చంద్ర పవార్ ’’ అనే పేరును ఖరారు చేసింది. త్వరలో మహారాష్ట్ర నుంచి ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీ పేరు, గుర్తులను ఎంచుకోవాలని ఎన్నికల కమీషన్ మంగళవారం సూచించింది. దీంతో శరద్ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను ఈసీకి పంపింది. వీటిని పరిశీలించిన కమీషన్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరుకు ఆమోదముద్ర వేసింది.
దేశాన్ని విభజించే కుట్రలను సహించలేం: మోడీ
కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో బుధవారం నాడు విమర్శలు గుప్పించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు రాజ్యసభలో బుధవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఇటీవల కాలంలో ఖర్గే ఎన్‌డీఏపై విమర్శలు చేశారు. 400 సీట్లతో ఎన్‌డీయే అధికారంలోకి వస్తుందని ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై మోడీ ఇవాళ స్పందించారు.
తరతరాలుగాగాంధీ-నెహ్రూ కుటుంబాన్ని ప్రభువుల్లా గౌరవించాలా ? - శరిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ భావజాలన్నీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ ప్రశ్నించారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆమె పాల్గొని మాట్లాడారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ ప్రతిభతోనే కాంగ్రెస్ లో పదవులు సంపాదించారని, కుటుంబ దాతృత్వం వల్ల కాదని ఆమె స్పష్టం చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని తరతరాలుగా భూస్వామ్య ప్రభువుల్లా గౌరవించాలా అని ఆమె ప్రశ్నించారు.నెహ్రూ-గాంధీ కుటుంబానికి మించిన నాయకత్వం కావాలని ఆమె వాదించిన మరుసటి రోజే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ICC Rankings: ప్రపంచ నంబర్.1 బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా..
ICC Rankings - Jasprit Bumrah: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో నంబర్.1 బౌలర్ గా నిలిచాడు. దీంతో టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, టీ20 క్రికెట్.. ఇలా మూడు ఫార్మాట్ లలో ఇప్పటివరకు నెంబర్.1 బౌలర్ గా నిలిచిన ప్లేయర్ గా ఘనత సాధించాడు.