Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ప్రధాని మోడీ అయోధ్య పర్యటన యొక్క పూర్తి షెడ్యూల్ .., అయోధ్య రామ మందిరం: తప్పుడు సమాచారం ఇవ్వొద్దని మీడియాకు ప్రభుత్వం వార్నింగ్, లల్లా విగ్రహం 51 ఇంచులే ఎందుకు? రేవంత్ కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండే .. కరెంట్ బిల్లులు చెల్లించొద్దు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పిలుపు, అయోధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా.. కేసీఆర్ పులి కాదు ఎలుక.. కాంగ్రెస్‌లో చేరడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన YS షర్మిల, OTTలో రిలీజ్ కానున్న 'గుంటూరు కారం' , వంటి వార్తల సమాహారం.
Today Top Stories: ప్రధాని మోడీ అయోధ్య పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
PM Modi Ayodhya Visit: జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్‌ని అధికారికంగా వెల్లడించారు. ఇందులోభాగంగా ప్రధాని సోమవారం ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో ప్రాణ ప్రతిష్ట పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు అయోధ్యలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2:15 గంటలకు కుబేర్ తిలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
undefined
అయోధ్య రామ మందిరం: తప్పుడు సమాచారం ఇవ్వొద్దని మీడియాకు ప్రభుత్వం వార్నింగ్
న్యూఢిల్లీ: ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమానికి ఇంకా 48 గంటలు కూడ లేదు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో సోషల్ మీడియా, మీడియాల్లో రామ మందిరానికి సంబంధించిన ఈవెంట్ తారుమారు చేసి ప్రచారం చేస్తున్నారనే విషయమై విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై వార్నింగ్ ఇచ్చింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి తప్పుడు, నిరాధారమైన ప్రచారం చేస్తే సహించబోమని మీడియా సంస్థలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.
నేడు తమిళనాడులోని అరిచల్ మునై పాయింట్‌ను సందర్శించనున్న ప్రధాని
అయోధ్యలోని రామ మందిరంలో రాంలల్లా విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట మహోత్సవానికి ఇంకా కొన్ని గంటలే సమయం వుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ శనివారం తమిళనాడు చేరుకున్నారు. తొలి రోజు పలు ఆలయాలను సందర్శించిన ప్రధాని.. ఆదివారం అరిచల్ మునై పాయింట్‌ను సందర్శిస్తారు. ఇక్కడ శ్రీకోదండరామ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి దర్శనం చేసుకుంటారు.
అయోధ్యలో రామ మందిరం: రామ్ లల్లా విగ్రహం 51 ఇంచులే ఎందుకు?
అయోధ్యలో రామ మందిరంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహన్ని నెల 19వ తేదీన ప్రతిష్టించారు.ఈ విగ్రహనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. రామ్ లల్లా ( బాలా రాముడు)విగ్రహం 51 ఇంచులే ఎందుకు? రామాలయంలో ప్రతిష్టించిన బాల రాముడి విగ్రహం 51 ఇంచుల ఎత్తులో ఉంది. అయితే రాముడి విగ్రహం 51 ఇంచుల ఎత్తు ఉండడానికి కూడ ఒక కారణం చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఐదేళ్ల పిల్లలు కనీసం 43 నుండి 45 ఇంచుల ఎత్తు ఉంటారు. అయితే రామాయణ కాలంలో మనుషులు చాలా పొడవుగా ఉండేవారని చెబుతారు. దీంతో బాల రాముడి విగ్రహన్ని 51 ఇంచులుగా రూపొందించారు. ఈ కారణంగానే రామ్ లల్లా విగ్రహం 51 ఇంచుల ఎత్తులో తయారు చేశారు.
అయోధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా..
రామ మందిర ప్రాణ ప్రతిష్ట రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబయింది. జనవరి 22న అయోధ్యకు ఎనిమిది వేల మందికి ఆహ్వానాలు అందాయి. జనవరి 23వ తేదీ నుంచి అందరూ భక్తులకు రామాలయంలో ప్రవేశం ఉంటుంది.. రామాలయ భద్రత దృష్ట్యా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. రియల్ టైం మానిటరింగ్ ను చేసే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రసిద్ధ సెక్యూరిటీ ఏజెన్సీలను నియమించారు.
రేవంత్ కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండే .. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ను కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండే అని అభివర్ణించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీజేపీలు పొత్తు పెట్టుకోవచ్చని, రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏక్‌నాథ్ షిండే కావచ్చని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీతో ఏ రోజు పొత్తు పెట్టుకోలేదనీ, భవిష్యత్తులోనూ ఎట్టిపరిస్థితి పొత్తుపెట్టుకోదని తేల్చి చెప్పారు. లోక్ సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోతారని సంచలన ఆరోపణలు చేశారు.
కరెంట్ బిల్లులు చెల్లించొద్దు.. కేటీఆర్ పిలుపు
గృహజ్యోతి పథకం కింద ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ అందించే వరకు కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రచార హామీలను తక్షణమే నెరవేర్చాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, పౌరులు తమ బిల్లులను సోనియా గాంధీ నివాసానికి పంపాలని ఆయన కోరారు. మహాలక్ష్మి పథకాన్ని తక్షణమే అమలు చేసి రూ.కోటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2500, హామీలను ఎగ్గొట్టడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు,
'కేసీఆర్ పులి కాదు .. ఎలుక'
Raghunandan Rao: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నాయకులు రఘునందన్ రావు ఓపెన్ చాలెంజ్ విసిరారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలోని నేతలు పోటీ చేసి.. ఒక్క సీటు అయినా తెచ్చుకోవాలని ఓపెన్ చాలెంజ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవీలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులికాదు, పిల్లి అంతకన్నా కాదు ఎలుక అని రఘునందన్ ఎద్దేవా చేశారు.
ఏపీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. సీట్ల పంపకాలపై చంద్రబాబుతో మాట్లాడుతూనే ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రలో ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారు. ప్రతి జోన్‌లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
వైఎస్ ఆశయాల కోసమే కాంగ్రెస్‌లో చేరా : వైఎస్ షర్మిల
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆమె శనివారం ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమితులైన అనంతరం తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు పోరాడతామని షర్మిల పేర్కొన్నారు.
#Gunturkaaramott 'గుంటూరు కారం' OTT రిలీజ్ ట్విస్ట్
సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ఓటిటి రిలీజ్ కు రంగం సిద్దమైందని సమాచారం. అయితే అతి తక్కువ టైమ్ లో ఓటిటిలో వచ్చేయటం ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మహేశ్ కొత్త సినిమాని 28 రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకురానుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి రెండో వారంలో అంటే 9 లేదా 10వ తేదీన 'గుంటూరు కారం' ఓటీటీలో వచ్చేయొచ్చు. 'సలార్' ఓటీటీ విడుదలనే దీనికి ఉదాహరణగా ఎదురుగా కనిపిస్తోంది. అయితే అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే ఇప్పటిదాకా లేదు.
సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి
Sana Javed, Shoaib Malik marriage: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే, ఇప్పటికే భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్ కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, సానియా-షోయబ్ ల వివాహం బంధం సాఫీగా లేదని పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు చెందిన సనా జావేద్ ను మరో వివాహం చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ప్రకటించి అందరీని షాక్ కు గురిచేశాడు.