Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యను దర్శించుకునే భక్తులకు ఇక ఆకలిబాధ లేనట్లే ... 

By Arun Kumar P  |  First Published Jan 21, 2024, 7:10 AM IST

అయోధ్య రామయ్యను దర్శించుకునే భక్తులెవ్వరూ ఆకలితో బాధపడకుండా పలు ధార్మిక సంస్థల ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అయోధ్యలో సామాన్య భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు సిద్దమయ్యరు.  


అయోధ్య : దేశంలోని మెజారిటీ హిందూ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం రేపు (జనవరి 22 సోమవారం) ప్రారంభంకానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రాజకీయ, వ్యాపార, సినీ మరియు ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం తర్వాతి రోజునుండి అయోధ్య ఆలయంలో కొలువైన అయోధ్య రామున్ని సామాన్య భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో రామయ్య దర్శనం కోసం అయోధ్యకు వచ్చే భక్తులు ఆకలితో బాధపడకుండా పలు ధార్మిక సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. 

పాట్నాకు చెందిన మహవీర్ ఆలయ ట్రస్ట్ అయోధ్యలో రామ్ కి రసోయి పేరిట వంటశాలను ప్రారంభించింది. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ఈ వంటశాలను ఏర్పాటుచేసారు. ప్రతిరోజూ దాదాపు 10వేల మంది రామభక్తులకు రుచికరమైన వంటకాలను అందించి కడుపునింపనుంది ఈ రామ్ కి రసోయి.  

Latest Videos

ఇక ఇస్కాన్, నిహాంగ్ సింగ్స్ వంటి సంస్థలు కూడా అయోధ్యకు వచ్చే భక్తులకు ఆహారాన్ని అందించేందుకు సిద్దమయ్యాయి. బాబా హర్జీత్ సింగ్ రసూల్ పూర్ నేతృత్వంలోని నిహాంగ్ సిక్కుల గ్రూప్ అయోధ్య చార్ ధామ్ మఠ్ లో లంగర్ పేరిట వంటశాలను ఏర్పాటుచేసారు. రెండు నెలల పాటు అయోధ్యకు వచ్చే భక్తులకు ఉచిత ఆహారం అందించనుంది నింహాంగ్ సిక్ గ్రూప్. 

Also Read  అయోధ్య : జనవరి 22న ప్రసాదంగా 13 లక్షల నేతి లడ్డూలు.

ఇక ఇస్కాన్ సంస్థ కూడా అయోధ్యకు వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసింది. ఐదువేల మందికిపైగా భక్తులకు ప్రతిరోజూ మద్యాహ్న భోజనాన్ని అందించనుంది ఇస్కాన్. ఇందుకోసం ఇప్పటికే అయోధ్యకు ఆహారాన్ని తరలించే ఏర్పాట్లు చేసింది.  

ఇలా వివిధ ధార్మిక సంస్థలు అయోధ్యకు వచ్చే సామాన్య భక్తులకు ఆహారాన్ని అందించేందుకు సిద్దమయ్యాయి. రామయ్య దర్శనంకోసం వచ్చే భక్తులెవ్వరూ ఆకలితో బాధపడకూడదనే ఈ ఉచితంగా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసినట్లు ధార్మిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇదిలావుంటే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా టాలీవుడ్  హీరో ప్రభాస్ భారీ ఖర్చుతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరిగింది. ఏకంగా రూ.50 కోట్లతో అయోధ్యకు వచ్చేవారికి ప్రభాస్ భోజన ఏర్పాట్లు చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించారు. అదంతా అబద్దపు ప్రచారమే అని తేల్చారు. ప్రభాస్ అయోధ్య రామ మందిర అన్నదాన కార్యక్రమం కోసం కోట్ల రూపాయలు దానం చేశాడనడంలో నిజం లేదని చెప్పుకొచ్చారు. దీంతో స్పష్టత వచ్చింది.  


 

click me!