Today Top 10 Telugu Lastest News 19 December 2023: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపది ద్రౌపతి ముర్ము, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్, ఆస్తి కోసం .. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య, దేశంలో మరోసారి కరోనా కలకలం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వంటి వార్తల సమాహారంతో asianetnews telugu.టాప్ 10 న్యూస్ మీ కోసం..
Today Top 10 Telugu Lastest News 19 December 2023:
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపది ద్రౌపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సాయంత్రం హైద్రాబాద్ బేగంపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేటలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి బొల్లారం వెళ్లనున్న రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇవాళ్టి(డిసెంబర్ 18) నుంచి 23వరకు రాష్ట్రపతి రాష్ట్రంలో శీతాకాల విడిది కోసం వచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నివాసంలో ఆమె బస చేయనున్నారు.
కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Ration Card: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. వీటిని గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారని, అందులోనే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఆస్తి కోసం .. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం ఓ వ్యక్తి దారుణానికి తెగాయించాడు. తొమ్మిది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆస్తి వివాదాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది. తొలి మూడు హత్యలను ప్రశాంత్ ఒక్కడే చేశాడు. అయితే మిగిలిన మూడు హత్యలకు ప్రశాంత్ తో పాటు మరికొందరున్నారని పోలీసులు గుర్తించారు. వీరిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యబద్దంగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
ముగిసిన లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారం నాడు ముగిసింది. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని ఆగనంపూడి వద్ద పాదయాత్రను నారా లోకేష్ ముగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కూడ వస్తున్నా మీ కోసం పాదయాత్రను ఆగనంపూడి వద్దే ముగించారు. ఈ నెల 11న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఇవాళ విశాఖపట్టణం జిల్లాలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని పైలాన్ ను నారా లోకేష్ ఆవిష్కరించారు.
మరోసారి కరోనా కలకలం.. దేశంలో పెరుగుతోన్న కేసులు..కేంద్రం అప్రమత్తం
Covid 19: మరోసారి కరోనా మహామ్మరి కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతోన్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. రానున్న పండగల సీజన్ కావడంతో వైరస్ కట్టడి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు ఇటీవల కేరళలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. భారత్ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌పోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 21న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. వారం నుండి పది రోజుల పాటు మెడిటేషన్ కోర్సు కోసం బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు పంపారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన మరునాడే కేజ్రీవాల్ మెడిటేషన్ కోర్సు కోసం బయలుదేరనున్నారు. ఈ నెల 19న మెడిటేషన్ కోర్సు కోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం ఉందని సమాచారం.
లోక్ సభలో సస్పెన్షన్ వేటు
పార్లమెంటులో భద్రతా వైఫల్య ఘటనపై ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు, పోడియం వద్దకు వెళ్లి నిరసనలు చేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ వారిపై చర్యలు తీసుకున్నారు. లోక్ సభ నుంచి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు చెందిన సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
ఇందులో 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా.. మరో ముగ్గురు ఎంపీలను ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఇప్పటికే 13 మందిపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్య 46కు చేరింది. రాజ్యసభలో కూడా ఇదే తీరు కనిపించింది. 45 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలపైనా వేటు పడింది.
ఐపీఎల్ 2024 వేలానికి రంగం సిద్ధం
IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 19న) దుబాయ్ వేదికగా వేలం జరుగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు కలిపి మొత్తం 333 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఇందులో 116 మంది ఆటగాళ్లు క్యాప్డ్ కాగా, 215 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు, ఇద్దరు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. 10 జట్లలో మొత్తం 77 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఇందులో 30 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. దీంతో వేలంపై ఉత్కంఠ నెలకొంది, ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్లను దక్కించుకుంటుందో? ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్లాడోనని అందరూ ఆత్రుతగా చూస్తున్నారు.