Dawood Ibrahim Net Worth: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయనపై పాకిస్థాన్‌లో విషప్రయోగం జరిగినట్లు, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఒకప్పుడు ముంబైలో బిచ్చగాడు,దొంగ అయిన దావూద్..నేడు అక్రమ వ్యాపారాల ఆధారంగా అండర్ వరల్డ్ డాన్ ఎదిగి వేలకోట్ల ఆస్తులు కూడబెట్టాడు.
Dawood Ibrahim Net Worth: 1993-ముంబై బాంబు పేలుళ్లు, 26/11 ఉగ్రవాద దాడుల సూత్రధారి డాన్ దావూద్ ఇబ్రహీం (67 ఏళ్లు) మరోసారి వార్తల్లో నిలిచాడు. కరాచీలో దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతను ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. దావూద్ గత 30 ఏళ్లుగా పాకిస్థాన్‌లో దాక్కుని, ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా తన అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ముంబైలోని రత్నగిరిలో 1955 డిసెంబర్ 26న జన్మించిన దావూద్ ఇబ్రహీం బాల్యం అక్కడే గడిపాడు. అతని తండ్రి ముంబై పోలీసులో కానిస్టేబుల్. చిన్న చిన్న దొంగతనాలు, దోపిడీలతోనే దావూద్ అండర్ వరల్డ్ డాన్ గా ఎదిగాడు. క్రమంగా అతను అండర్ వరల్డ్ క్రైమ్ యొక్క అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను స్థాపించాడు. తన కంపెనీకి 'డి కంపెనీ' అని పేరు పెట్టాడు. భారత్, పాకిస్థాన్ సహా ప్రపంచంలోని 50కి పైగా దేశాల్లో దావూద్ అక్రమ వ్యాపారం విస్తరించింది. దీని కారణంగా అతను వేల కోట్ల రూపాయల విలువైన సంపదను సంపాదించాడు. అతని భార్య మెహజబీన్, సోదరుడు అనీస్ కలిసి దావూద్ ఇబ్రహీం వ్యాపారాన్ని నడుపుతున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ది గార్డియన్ నివేదిక ప్రకారం, 1980-1990లలో దావూద్ ఇబ్రహీం వ్యభిచారం, జూదం, డ్రగ్స్ వ్యాపారం ద్వారా బిలియన్ల రూపాయలు సంపాదించాడు. దావూద్ ఇబ్రహీం ప్రపంచ ఉగ్రవాద సంస్థ డి కంపెనీకి అధిపతిగా పరిగణించబడ్డాడు.
దావూద్ ఇబ్రహీంకు ఎంత ఆస్తి ఉంది?
ఫోర్బ్స్ ప్రకారం.. దావూద్ ఇబ్రహీం ఆల్ టైమ్ ధనిక గ్యాంగ్‌స్టర్లలో ఒకడు. 2015లో దావూద్ ఇబ్రహీం నికర విలువ 6.7 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 55 వేల కోట్లు)గా ఫోర్బ్స్ అంచనా వేసింది. మీడియా కథనాల ప్రకారం.. దావూద్‌కు పాకిస్తాన్ నగరంలో 3 విలాసవంతమైన ఇళ్ళు కూడా ఉన్నాయి. కరాచీలోని క్లిఫ్టన్‌లోని డి-13, బ్లాక్-4లో 6,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన బంగ్లాలో దావూద్ నివసిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కరాచీ నో-ట్రాస్‌పాస్ జోన్ ఉంది. ఇది పాకిస్తానీ రేంజర్లచే పటిష్టంగా రక్షించబడింది.
బహుళ నగరాల్లో ఆస్తులు
దేశంలోని పలు నగరాల్లో దావూద్‌కు కోట్లాది ఆస్తులున్నట్లు తెలుస్తోంది. దావూద్ పేరు మీద ఒక హోటల్ (దావూద్ ఇబ్రహీం హోటల్) కూడా ఉంది. దానిని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. దావూద్‌కు చెందిన అనేక ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ముంబై , ఇతర నగరాల్లోని ఆస్తులు ఉన్నాయి. దావూద్‌కి దుబాయ్‌లో కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. దావూద్‌కు ముంబైలో హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్ కారు కూడా ఉంది. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
వేలం వేసిన ఆస్తి
దావూద్ ఆస్తులను భారత ప్రభుత్వం అనేక రౌండ్లలో వేలం వేసింది. 2017, 2020లల్లో దావూద్ ఇబ్రహీం ఆస్తులను వేలం వేసి భారత ప్రభుత్వం డాన్‌కు షాక్ ఇచ్చింది. 2017లో వేలం వేసిన డాన్ ఆస్తిని ముంబైకి చెందిన సైఫీ బుర్హానీ ని అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఢిల్లీలో జైకాగా పిలిచే అతని రౌనక్ అఫ్రోజ్ రెస్టారెంట్‌ను రూ.4.53 కోట్లకు కొనుగోలు చేశారు. దామర్‌వాలాలోని దావూద్ ఆస్తిని రూ.3.53 కోట్లకు విక్రయించారు. షబ్నమ్ గెస్ట్ హౌస్‌ను రూ.3.52 కోట్లకు వేలం వేశారు. అదేవిధంగా.. 2020లో దావూద్‌కు చెందిన మరో 6 ఆస్తులను భారత ప్రభుత్వం విక్రయించింది. ఈ వేలంలో రూ.22.79 కోట్లు వచ్చాయి.
మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా
దావూద్ ఇబ్రహీంకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మ్యాచ్‌లు చూడటంతోపాటు బెట్టింగ్‌లు కూడా చేసేవాడు. తర్వాత మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో దీని పేరు తెరపైకి వచ్చింది. ఇవే కాకుండా 2జీ స్పెక్ట్రమ్ సహా అనేక కుంభకోణాల్లో దావూద్ పాత్ర ఉంది. 1993 ముంబై బాంబు పేలుళ్లను నిర్వహించడమే కాకుండా.. నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు చెందిన ఒసామా బిన్ లాడెన్, అమాన్ అల్-జవహిరీలతో కూడా దావూద్ ఇబ్రహీం సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐఎస్ , అల్-ఖైదా ఆంక్షల కమిటీ దావూద్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
బ్రిటన్‌లో 450 మిలియన్ డాలర్ల ఆస్తి
దావూద్ ఇబ్రహీంకు యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియాలో విస్తరించి ఉన్న డజనుకు పైగా దేశాల్లో ఆస్తులున్నాయి. ఒక్క బ్రిటన్‌లోనే అతని ఆస్తుల విలువ 450 మిలియన్ డాలర్లు. దావూద్ ప్రపంచ దేశాల్లో 50కి పైగా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం వ్యాపారం భారత్, పాకిస్థాన్, బ్రిటన్, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మలేషియా మరియు సింగపూర్ దేశాలకు విస్తరించింది.