ఒకవేళ గగన్‌యాన్ మిషన్ విఫలమైతే, వాట్ నెక్ట్స్ .. రేపు ‘‘ఫెయిల్యూర్’’ టెస్ట్ నిర్వహించనున్న ఇస్రో

Siva Kodati |  
Published : Oct 20, 2023, 07:04 PM IST
ఒకవేళ గగన్‌యాన్ మిషన్ విఫలమైతే, వాట్ నెక్ట్స్ .. రేపు ‘‘ఫెయిల్యూర్’’ టెస్ట్ నిర్వహించనున్న ఇస్రో

సారాంశం

గగన్‌యాన్ మిషన్‌కు ఇస్రో సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మనిషిని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలన్నది ఈ మిషన్ లక్ష్యం . ఈసారి మనిషిని అంతరిక్షంలోకి పంపుతున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం. 

చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్‌ 1ల సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మంచి ఊపులో వుంది. ఎప్పుడు ఏం చేస్తుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఒకప్పుడు మనల్ని అవమానించిన వారే ఇప్పుడు మన టెక్ సపోర్ట్ కోసం బతిమలాడుకుంటున్నారు. చంద్రయాన్ 3 అనుభవాలను తమతో పంచుకోవాల్సిందిగా స్వయంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)నే అడిగిందంటే స్పేస్‌లో ఇస్రో స్థాయి ఎక్కడికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు. 

కాగా .. త్వరలో గగన్‌యాన్ మిషన్‌కు ఇస్రో సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మనిషిని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలన్నది ఈ మిషన్ లక్ష్యం. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ బలమైన మద్ధతుదారుగా నిలిచారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం అబార్ట్ పరీక్షను నిర్వహించనుంది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా నిలిచిన భారత్..ఈసారి మనిషిని అంతరిక్షంలోకి పంపుతున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం. ఏ చిన్న లోపం జరిగినా మూల్యం భారీగా వుంటుంది. అందుకే ముందుగా ఓ ఫెయిల్యూర్‌ను మాక్ డ్రీల్‌లా నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది. 

ఇస్రో పరిశోధనా కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. గగన్ యాన్ మిషన్ విషయాలను పంచుకున్నారు. వ్యోమగాముల భద్రత ఇస్రోకు అత్యంత కీలకమన్నారు. మొదటి మిషన్ ..ఫ్లైట్ సమయంలో సిబ్బంది తప్పించుకునే వ్యవస్థను చూపడమని నాయర్ తెలిపారు. ఆరోహణ దశలో ఏ పరిస్ధితుల్లోనైనా స్పేస్ షిప్‌లో ఏదైనా తప్పు జరిగితే సిబ్బందికి భద్రత ఉండేలా చూసుకోవాలన్నారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎలాంటి పరిస్ధితుల్లో నైనా పనిచేసే విధంగా వుండాలని నాయర్ చెప్పారు. 

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని తొలి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 8 గంటలకు ఈ టెస్ట్ జరగనుంది. అసలు గగన్‌యాన్ ఫ్లైట్‌లో వ్యోమగాములు ప్రయాణించే ఒత్తిడి లేని క్రూ మాడ్యూల్.. క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లను టెస్ట్ వెహికల్‌పైన అమర్చనున్నారు. వాహనం ఎత్తు 12 కిలోమీటర్లకు చేరి ట్రాన్స్‌సోనిక్ స్థితిని చేరుకున్నప్పుడు వెహికల్ థ్రస్ట్‌ను నిలిపివేస్తారు. ఎస్కేప్ సిస్టమ్ మోటర్లు యాక్టివేట్ చేయబడతాయి. ఇది క్రూ మాడ్యూల్ ప్లస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను దాదాపు 17 కి.మీల ఎత్తుకు తీసుకెళ్తుంది. ఆ ఎత్తులో సిబ్బంది వున్న మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ నుంచి విడుదలవుతుందని నాయర్ వెల్లడించారు. 

క్రూ మాడ్యూల్ తనంతట తానుగా తిరగడం, అవసరమైన దిశలో తనను తాను నడిపించే విధంగా రూపొందించారు. అది పూర్తయిన తర్వాత పారాచూట్‌లు మోహరించబడతాయి. మాడ్యూల్.. లాంచ్ ప్యాడ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వున్న సముద్రంలోకి నెమ్మదిగా పడిపోతుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ , లాంచ్ వెహికల్ కూడా అనంతరం సముద్రంలోకి వస్తాయి. కానీ అవి సిబ్బంది మాడ్యూల్‌కు చాలా దూరంలో వుంటాయి. 

ఈ మొత్తం పరీక్ష 9 నిమిషాల పాటు కొనసాగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2025లో ప్రారంభించాలని భావిస్తున్న గగన్‌యాన్ .. 3 రోజుల మిషన్ కోసం 400 మీటర్ల కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లి .. భారత జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu