
ప్రజాస్వామ్య అధికారాలను ఒక వర్గం ప్రజలు స్వాధీనం చేసుకుంటున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం స్పందించారు. టీఎంసీపై, మమతా బెనర్జీపై ఎదురుదాడికి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి న్యాయ వ్యవస్థపై పెద్దగా గౌరవం లేదని తెలిపారు.
మమతా బెనర్జీ ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో న్యాయం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని న్యాయవ్యవస్థ, వివిధ రంగాల నాయకులను కోరారు. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో రాష్ట్రపతి పాలనను తీసుకువచ్చే రోజు వస్తుందని చెప్పారు. ఈ చర్య వెనుక అధికార పార్టీ హస్తం ఉందని ఆమె బీజేపీ పేరు ప్రస్తవించకుండా అన్నారు. తీర్పు రాకముందే అనేక విషయాలు జరిగిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాను ఈ మాట అంటున్నందుకు మన్నించాలని అన్నారు. తన మాటలు తప్పు అని భావిస్తే క్షమించాలని తెలిపారు. ఎన్‌యూజేఎస్ ప్రపంచంలోనే ముఖ్యమైన సంస్థల్లో ఒకటి అని పేర్కొన్నారు.
ప్రస్తుత సీజేఐ పాత్ర కూడా గొప్పదని వివరించారు. రెండు నెలల్లోనే జ్యూడీషియరీ అంటే అర్థమేమిటో చూపించారని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిందని తాను చెప్పడం లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ, పరిస్థితులు దారుణంగా దిగజారిపోతున్నాయని తెలిపారు. అన్యాయం నుంచి న్యాయ వ్యవస్థనే ప్రజలను కాపాడాలని కోరారు. వారి బాధలు వినాలని వివరించారు. ఇప్పుడు ప్రజలు తలుపులు వేసుకుని రోధిస్తున్నారని తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సమక్షంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆమె వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు అర్ధరాత్రి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ..‘‘టీఎంసీ పార్టీకి న్యాయవ్యవస్థ పట్ల తక్కువ గౌరవం, న్యాయమూర్తుల పట్ల గౌరవం లేదు కాబట్టి పశ్చిమ బెంగాల్ విషయంలో మమతా దీదీ నిజాలు చెబుతున్నారు ’’ అని అన్నారు. దీంతో పాటు రూల్ ఆఫ్ లా కాకుండా టీఎంసీ రూల్ బై టీఎంసీ లా ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం రక్తం కారుతున్నదని, పశ్చిమ బెంగాల్ ఏడుస్తోందన్నారు. కాగా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారాలపై అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు.