రైల్వే మంత్రి రాజీనామా చేయాలని తృణమూల్ డిమాండ్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన బీజేపీ..

By Rajesh KarampooriFirst Published Jun 3, 2023, 5:53 AM IST
Highlights

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 200 మందికి పైగా మరణించగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు రైల్వే మంత్రి అష్నిని వైష్ణవ్ రాజీనామా చేయాలని టీఎంసీ డిమాండ్ చేస్తుంది.  

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రాజకీయ స్పందనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) డిమాండ్ చేసింది. తాజాగా టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి రైలు ప్రమాదాలను నివారించడానికి యాంటీ-కొలిజన్ పరికరాలను అమర్చడానికి బదులుగా, ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌పై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా రాజకీయ మద్దతు పొందడానికి వందే భారత్, కొత్తగా నిర్మించిన స్టేషన్ల గురించి గొప్పగా చెబుతోంది, కానీ భద్రతా చర్యల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టిఎంసి నాయకుడు అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో వ్రాస్తూ.. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత,  దాని చర్యల వల్ల పేదలు,  అణగారిన వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారనీ, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, లాక్‌డౌన్, వ్యవసాయ చట్టం వంటి అనాలోచిత చర్యలు వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని విమర్శలు గుప్పించారు.  


ఈ సందర్బంగా అభిషేక్ బెనర్జీ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తూ.. “ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయ సంతాపం. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మనస్సాక్షి గొంతు వదిలితే రైల్వే మంత్రి రాజీనామా చేయాలి. ఇప్పుడే!" అని పేర్కొన్నారు.. 

బీజేపీ కౌంటర్ 

అదే సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఈ విషాద ప్రమాదాన్ని రాజకీయం చేయడానికి టిఎంసి నాయకుడు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. “మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కూడా రైలు ప్రమాదాలు జరిగాయి. ఆమె రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.  ఈ ఘోర ప్రమాదంపై టీఎంసీ రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు.

ఈ ప్రమాద విషయానికి వస్తే..  బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బాలాసోర్ జిల్లాలో గూడ్స్ రైలు ఒక్కదానినొకటి ఢీ కొట్టుకోవడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  కనీసం 207 మంది మరణించగా.. 900 మందికి పైగా గాయపడ్డారు.

click me!