మరాఠా కోటా ప్రకటించేవరకు ఏ పార్టీ రాజకీయ నాయకుడు మా గ్రామంలో అడుగు పెట్టొద్దు. రాజకీయ నేతలు వారి పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించినట్టు మేం కూడా మా పిల్లలకు రిజర్వేషన్ల కోసం పోరాడొద్దా? అని మహారాష్ట్ర అకోలా జిల్లాలోని ఓ గ్రామస్తులు అంటున్నారు.
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం తీవ్ర ఉద్యమం జరుగుతున్నది. ఆ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. వెంటనే మరాఠా, ధంగర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని, ఉద్యమ సారథి జరంగే జీవితంతో ఆటలాడుకోవద్దు అని సూచించారు.
ఈ నేపథ్యంలోనే అకోలా జిల్లా చరన్‌గావ్ నివాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరాఠా కోటా ప్రకటించే వరకు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను మా గ్రామంలోకి రాకుండా నిషేధిస్తున్నామని ఆదివారం తెలిపారు. పాతుర్ తాలుకాలోని ఈ గ్రామం శివారులో ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ బోర్డులు పెట్టారు. విద్యా ఉద్యోగాల్లో తమ కమ్యూనిటికీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించేదాకా ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కూడా తమ గ్రామంలోకి రానివ్వబోమనే నిర్ణయం తీసుకున్నట్టు గ్రామస్తులు చెప్పారు.
Also Read: మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ .. సీఈవో కీలక వ్యాఖ్యలు
అకోలా జిల్లాలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి గ్రామం చరన్‌గావ్ అని గ్రామస్తుడు రాజేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు.
రాజకీయ నాయకులు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించినట్టే మేం ఎందుకు మా పిల్లలకు రిజర్వేషన్ల కోసం పోరాడవద్దు? అని మరో గ్రామస్తుడు అన్నారు.