కేరళలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ కొచ్చికి చెందిన డొమినిక్ మార్టిన్ కొడకరా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
కేరళలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుళ్ల ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన ఎవరి పని అన్న దానిపై కేరళ పోలీసులు, జాతీయ దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ కొచ్చికి చెందిన డొమినిక్ మార్టిన్ కొడకరా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి ముందు.. నిందితుడు పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్‌లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
యెహోవాసాక్షుల పట్ల తనకున్న వ్యతిరేకత కారణంగానే బాంబు దాడి జరిగిందని, తాను 16 ఏళ్లుగా ఆ గ్రూపులో సభ్యుడిగా వున్నానని మార్టిన్ సదరు వీడియోలో పేర్కొన్నాడు. ఆరేళ్ల క్రితమే యెహోవాసాక్షులను దేశద్రోహ సంస్థగా గుర్తించానని.. వారి ప్రచారం కారణంగా ఇతరులు కూడా నాశనమవుతారని ఆయన వ్యాఖ్యానించాడు. తప్పుడు ఆలోచనలను ప్రచారం చేసే వారిని అదుపు చేయకుంటే తనలాంటి సామాన్యులు కూడా స్పందిస్తారని మార్టిన్ హెచ్చరించాడు.
undefined
కొచ్చి బాంబు పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోలో .. పేలుడు పద్ధతిని మీడియాకు చూపకూడదని మార్టిన్ పేర్కొన్నాడు. ఐదు రోజుల క్రితం రూపొందించిన ఫేస్‌బుక్ పేజీ ద్వారా డొమినిక్ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. వీడియో పోస్ట్ అయిన క్షణాల్లోనే డొమినిక్ మార్టిన్ ఫేస్‌బుక్ పేజీ అదృశ్యమైంది.
మరోవైపు.. ఏడీజీపీ అజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. డొమినిక్ మార్టిన్ అందించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ దశలో ఇంతకుమించి ఎక్కువ చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. త్రిసూర్ రూరల్ లోని కొడక్రా పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి లొంగిపోయాడని, అతని పేరు డొమినిక్ మార్టిన్ అని .. తాను అదే గ్రూప్ (యెహోవాసాక్షులు)కు చెందినవాడినని చెబుతున్నాడని ఏడీజీపీ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని.. హాల్ మధ్య భాగంలో పేలుళ్లు ఎలా జరిగాయో ఆరా తీస్తున్నట్లు అజిత్ చెప్పారు.
ఇదిలావుండగా.. డొమినిక్ మార్టిన్, అతని భార్యను పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే అతనిని కలమస్సేరి ఏఆర్ క్యాంప్‌కు తీసుకురానున్నారు. నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాంబులను పెట్రోల్ బాటిల్‌లో వుంచినట్లు చెప్పాడు. పేలుడు పదార్ధాలను కొనుగోలు చేసిన దుకాణాల గురించి కూడా అతను పోలీసులకు వివరాలు అందజేశాడు. అలాగే ఇంటర్నెట్ ద్వారా బాంబులు ఎలా తయారు చేయాలన్నది ఆరు నెలల్లోనే నేర్చుకున్నానని మార్టిన్ చెప్పాడు.
కాగా.. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 18 మంది వివిధ ఆసుపత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా వుంది. ఈ పేలుడులో 12 ఏళ్ల బాలుడికి 95 శాతం కాలిన గాయాలయ్యాయి. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.