
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో టైగర్స్ మన దేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఈ అడవిరాజుల్లో 70 శాతం వరకు మన దేశంలోనే ఉన్నాయి. అయితే, విచక్షణారహిత వేట, పర్యావరణ సమస్యలతో ఈ పులులు కొన్నేళ్ల క్రితం ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. కానీ, ప్రభుత్వం ఈ పులుల మరణాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నది. తాజాగా, ఈ పులుల మరణాల సంఖ్య మరింత తగ్గినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ మరణాల రేటు 25 శాతం తగ్గినట్టు వివరించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు మన దేశంలో 54 పులులు మరణించాయి. ఇదే కాలంలో గతేడాది 72 బెబ్బులులు చనిపోయాయి.
పులుల మరణాలు, జననాలపై ఎన్‌టీసీఏ కచ్చితమైన రికార్డు మెయింటెయిన్ చేస్తున్నది. ఏ రాష్ట్రంలో ఎక్కడ పులి మరణించినా.. జన్మించినా వాటి వివరాలు ఆయా రాష్ట్ర అటవీ శాఖ ఎన్‌టీసీఏకు వివరాలు అందిస్తుంది.
మన దేశంలోనూ పులుల సంఖ్య ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. ఇదే రాష్ట్రంలో మరణాల రేటు కూడా ఎక్కువే ఉన్నది. ఈ ఏడాది పైన పేర్కొన్న కాల వ్యవధిలో మధ్యప్రదేశ్‌లో 18 టైగర్లు మరణించాయి. కాగా, ఆ తర్వాత మహారాష్ట్రలో 13 పులులు, కర్ణాటకలో ఎనిమిది, అసోంలో నాలుగు, కేరళలో మూడు పులులు మృత్యువాత పడ్డాయి.
గతేడాదితో పోల్చితే.. మధ్యప్రదేశ్‌లో పులుల మరణాలు 25 శాతం తగ్గాయి. గతేడాది మధ్యప్రదేశ్‌లో 25 పులులు మరణించగా.. 2022లో 18 పులులు మృతి చెందాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఈ మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఈ రాష్ట్రాల్లో వరుసగా 18 పులులు, ఒక్క పులి మరణించాయి. కాగా, అసోంలో గతేడాది మూడు మరణిస్తే.. ఈ ఏడాది అంతకంటే ఒకటి ఎక్కువగా మృతి చెందాయి. కేరళలో మరణాల సంఖ్య మారకుండా స్థిరంగా మూడు దగ్గరే ఉన్నది.
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్టు 2018 ప్రకారం, ఇండియాలో కనీసం 2967 పులులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 526, కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్‌లో 442 పులులు ఉన్నాయి.