
2024 Lok Sabha polls: నలుగురు పంజాబ్ కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ మంత్రులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరడంతో..కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పెద్ద పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే, పంజాబ్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ కోర్ గ్రూప్ సభ్యులు, ఆఫీస్ బేరర్లు మరియు జిల్లా అధ్యక్షులతో సహా రాష్ట్ర బీజేపీ నాయకులను ఉద్దేశించి షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేవలం మూడు నెలల్లో ఆప్ ప్రభుత్వ వంచన, మోసంపూరతతత్వం బహిర్గతమైందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భాజపా పెద్దన్న పాత్ర పోషిస్తుందని.. మాతో చేతులు కలపాలనుకునేవారంతా చిన్న భాగస్వామిగా ఉండాల్సిందేనని, బీజేపీలోకి రావాలనుకునే వారిని కూడా స్వాగతిస్తామని ఆయన చెప్పినట్లు పీటీఐ నివేదించింది.
మతం మరియు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పంజాబ్ ప్రజలు చేసిన చారిత్రాత్మక త్యాగాలను కూడా షా గుర్తు చేసుకున్నారు. "పంజాబ్‌లోని ప్రతి పౌరుడికి కేంద్రం మరియు దేశం అండగా నిలుస్తుందని నేను పంజాబ్ ప్రజలకు హామీ ఇస్తున్నాను. పంజాబ్‌లో ఈ సంక్షోభ పరిస్థితి మరింత దిగజారడానికి అనుమతించబడదు" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు."ఐదేళ్లలో ఆప్ సర్కారు ఏమి చేస్తుందో ఆలోచిస్తేనే వణుకు పుడుతుంది" అని షా అన్నారు. శాంతిభద్రతల పరిస్థితిని ఉద్దేశిస్తూ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించనుందని, ప్రజలు ఆప్ పట్ల అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వాటిని పాతరేసేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన తన పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అన్ని రాజకీయ పుకార్లకు స్వస్తి పలికిన షా, బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అందులో చేరాలనుకునే వారు తమ 'కమలం' గుర్తుపై పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
నలుగురు పంజాబ్ కాంగ్రెస్ నేతలు - రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, సుందర్ శామ్ అరోరా మరియు గురుప్రీత్ సింగ్ కంగర్ లు చండీగఢ్‌లో బీజేపీలో చేరిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. బర్నాలా నుండి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేవల్ ధిల్లాన్ మరియు మాజీ SAD ఎమ్మెల్యేలు సరూప్ చంద్ సింగ్లా మరియు మొహిందర్ కౌర్ జోష్ కూడా బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, సోమ్ ప్రకాష్, రాష్ట్ర యూనిట్ చీఫ్ అశ్వనీ శర్మ, పార్టీ సీనియర్ నేతలు దుష్యంత్ గౌతమ్, తరుణ్ చుగ్, సునీల్ జాఖర్, మంజీందర్ సింగ్ సిర్సా సమక్షంలో వారు బీజేపీలో చేరారు. మొహాలీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్బీర్ సిద్ధూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండగా, రాంపుర ఫుల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్‌ప్రీత్ కంగార్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు.
మజా ప్రాంతానికి చెందిన ప్రముఖ దళిత నాయకుడు వెర్కా మూడుసార్లు శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం మరియు సాధికారత మరియు మైనారిటీల మంత్రిగా పనిచేశారు. హోషియార్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సుందర్ శామ్ అరోరా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. మొహాలీ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న బల్బీర్ సిద్ధూ సోదరుడు అమర్‌జిత్ సింగ్ సిద్ధూ కూడా బీజేపీలో చేరారు.