టీఎంసీ నేతలను చెట్టుకు కట్టేసి.. బట్టలూడదీయండి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Dec 26, 2022, 1:25 PM IST
Highlights

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ నేతలను చెట్టుకు కట్టేసి బట్టలూడదీయాలని అన్నారు. పంచాయతీ నిధులను వారు స్వాహా చేశారని, వాటి వివరాలు అడగాలని సూచించారు. ఆ వివరాలు వెల్లడించకుంటే చెట్టుకు కట్టేయాలన్నారు.
 

కోల్‌కతా: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలను చెట్టుకు కట్టేయాలని అన్నారు. బట్టలూడదీయండి అని పేర్కొన్నారు. పంచాయతీ ఫండ్స్‌ ఖర్చుల వివరాలు ఇవ్వకుంటే ఈ పని చేయాలని సూచించడం వివాదాన్ని రేపింది.

బీజేపీ పశ్చిమ బెంగాల్ యూనిట్‌కు గతంలో అధ్యక్షుడిగా పని చేసిన దిలీప్ ఘోష్ ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాలో ఓ సమావేశంలో పార్టీ వర్కర్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనుల కోసం జారీ చేసిన పంచాయతీ నిధుల వివరాలను పంచాయతీ సభ్యులను అడగండి అని అన్నారు. ఒక వేళ వారు వాటి వివరాలు ఇవ్వకుంటే చెట్టుకు కట్టేయండని తెలిపారు.

Also Read: వ్యక్తిని అడవిలోకి ఈడ్చుకెళ్లి.. సగం తిని వదిలేసిన పులి.. అది చూసిన స్నేహితులు పరుగులు..

‘బీజేపీ అవినీతి, హింసకు వ్యతిరేకంగా పని చేస్తున్నది. అందుకే 77 మంది ఎమ్మెల్యేలు, 18 ఎంపీలను గెలిపించారు. పంచాయతీ సభ్యులనూ గెలిపించారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. చివరి సారి మనల్ని నామినేషన్ వేయకుండా వారు అడ్డుకున్నారు. ఆ గూండాలే ఎన్నికయ్యారు. ఐదేళ్లుగా ప్రజా ధనాన్ని స్వాహా చేస్తున్నారు. ప్రజల నుంచి ఆగ్రహం వెలువడుతుందనే వారిప్పుడు కనిపించకుండా తిరుగుతున్నారు. వారిని చెట్టుకు కట్టేసి ఖర్చు పెట్టిన నిధులను అడగండి. వారి బట్టలూడదీయండి. ప్రజల డబ్బుతోనే వాళ్లు బంగ్లాలు కట్టుకున్నారు. ఇప్పుడు వారు తిరుగుతున్న కార్లనూ మీ డబ్బులతోనే కొనుక్కున్నారు’ అని దిలీప్ ఘోష్ అన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలతో మార్పు వస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ పంపిన డబ్బులను పేద ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

click me!