ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్రోల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో టూ వీలర్ మీద వెడుతున్న ఓ కుటుంబం తీవ్ర ప్రమాదానికి గురైంది. మూడేళ్ల వయసున్న కవల చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
పూణె : పూణెలోని విశ్రాంతివాడి చౌక్ వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో మూడేళ్ల వయసున్న కవల సోదరీమణులు మృతి చెందారు. వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ కుమార్ ఝా (40) తన 3 ఏళ్ల కవల కుమార్తెలు, భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెడుతూ.. విశ్రాంతివాడి చౌక్ వద్ద ట్రాఫిక్ లైట్ వద్ద ఆగాడు.
undefined
సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్.. వివరాలు ఇవే..
సిగ్నల్ పడడంతో వెనుక నుంచి వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, వారి తల్లిదండ్రులిద్దరూ గాయపడ్డారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు అందులో ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే వారిని ఆ చుట్టుపక్కల వాళ్లు చుట్టుముట్టడం..అక్కడివారు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అత్యవసర సేవలను ఫోన్ చేయడం కనిపిస్తున్నాయి.
ప్రమాద సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్రగాయాలై ససూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"చౌక్ వద్ద గ్రీన్ సిగ్నల్ పడగానే పెట్రోల్ ట్యాంకర్ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్‌ను ఇండియన్ పీనల్ కోడ్, మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు" అని పోలీసులు తెలిపారు