తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి..!

By team teluguFirst Published Oct 25, 2021, 10:45 AM IST
Highlights

తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో గ్రే హౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు-బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో గ్రే హౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు-బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గ్రే హౌండ్స్ బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా.. మృతుల్లో ఒకరు మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే-47, ఇతర రైఫిల్స్‌, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో మావోయిస్టులకు వరసుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో భద్రతా బలగాలపై మావోయిస్టులు భీకర దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోలు జరిపిన దాడిలో 23 మంది జవాన్లు మృతిచెందారు. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు భారీగా సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందడంతో దండకారణ్య పీఎల్‌జీఏ బెటాలియన్‌ కమాండర్‌ హిడ్మా ఆధ్వర్యంలోని మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడి సమయంలో మావోయిస్టులు జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను కిడ్నాప్ చేశారు. ప్రభుత్వం పంపిన మధ్యవర్తులు చర్చలు జరపడంతో.. మావోలు రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేశారు. 

ఈ దాడుల్లో దాదాపు 650 మంది మావోయిస్టులు పాల్గొని ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌ఘడ్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో మావోల ఏరివేతకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు.
 

click me!