
ముంబయి: పంజాబ్ ర్యాపర్ సిద్దూ మూసే వాలా హత్య దేశవ్యాప్తంగా గ్యాంగ్‌స్టర్‌ల గురించిన చర్చను లేవదీసింది. మరీ ముఖ్యంగా ఈ హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ లారెన్స్ గురించి చాలా కథనాలు వచ్చాయి. సిద్దూ మూసే వాలా హత్య ఉదంతం ఇంకా మరువకముందే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. సిద్దూ మూసే వాలా తరహాలోనే అంతమొందిస్తాం అనే బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖపై ఎవరి సంతకం లేదు. కానీ, ఈ లేఖ సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్‌లను ఉద్దేశించి ఉన్నది. దీంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ లేఖ ముంబయిలో బాంంద్రా బాండ్‌స్టాండ్ ప్రొమనేడ్ వద్ద జూన్ 5వ తేదీన లభించింది. సలీం ఖాన్ మార్నింగ్ వాక్‌కు బాండ్‌స్టాండ్ ప్రొమనేడ్‌కు వెళ్తుంటారు. మార్నింగ్ వాక్ తర్వాత అక్కడ కాసేపు కూర్చోవడం ఆయన దినచర్యలో భాగంగా ఉన్నది. జూన్ 5వ తేదీన కూడా ఆయన మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అక్కడే ఆయన గార్డుకు ఈ లేఖ కనిపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపడానికి కుట్ర పన్నినట్టు బిష్ణోయ్ లారెన్స్ పోలీసుల దర్యాప్తులో అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖపై ఆయన వైఖరిపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖపై బిష్ణోయ్ మాట్లాడుతూ, ఈ లేఖ ఎవరు రాసారో తనకు తెలియదని వివరించారు. కాగా, ఆ లేఖలో బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ ఇనీషియల్స్‌ను ప్రస్తావించడాన్ని ఆరా తీయగా.. గోల్డీ బ్రార్‌కు సల్మాన్ ఖాన్‌తో ఎలాంటి శత్రుత్వం లేదని లారెన్స్ తెలిపారు. కాబట్టి, గోల్డీ బ్రార్.. సల్మాన్ ఖాన్‌ను బెదిరించే అవకాశం లేదని పేర్కొన్నారు.
సిద్దూ మూసే వాలాను బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ మే 29వ తేదీన దారుణంగా హతమార్చింది.
అయితే, లారెన్స్ బిష్ణోయ్ 2018లో సల్మాన్ ఖాన్‌ను చంపడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. సల్మాన్ ఖాన్‌ను చంపడానికి రాజస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రాను పురమాయించినట్టు సమాచారం. బిష్ణోయ్ ఆదేశాల మేరకు సంపత్ నెహ్రా ముంబయి వెళ్లి బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టూ రెక్కీ చేసినట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది. జోద్‌పూర్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్ పేర్కొన్న వీడియోను ఈ మీడియా సంస్థ సంపాదించినట్టు తెలిసింది.