
Bharatiya Kisan Union leader Rakesh Tikait: రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ ను బాంబులు పేల్చి చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నారు. రద్దు చేసిన మూడు వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకులలో రాకేష్ టికాయత్ ఒకరు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు చేస్తున్న నిరసనల్లో ఆయన పాల్గొంటూనే ఉన్నారు.
వివరాల్లోకెళ్తే.. రైతు నిరసనల నుంచి తప్పుకోకపోతే భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్, ఆయన కుటుంబంపై బాంబులతో దాడి చేసి వారిని చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. రైతు ఆందోళనలకు దూరంగా ఉండాలని బెదిరించాడు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని రాకేష్ టికాయత్ సోదరుడు, బీకేయూ అధ్యక్షుడు నరేష్ టికాయత్ కుమారుడు గౌరవ్ టికాయత్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు భౌరా కలాన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో అక్షయ్ శర్మ తెలిపారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామనీ, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని శర్మ తెలిపారు.
గతంలోనూ కోందరు తమకు ఫోన్ కాల్ చేసి చంపేస్తామని బెదిరించారని రాకేష్ టికాయత్ అన్నారు. అంతకుముందు కాల్చి చంపుతామని బెదిరించిన వారు ఇప్పుడు బాంబులతో దాడి చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. బయటకు వెళ్లొద్దనీ, రైతు నిరసనల్లో పాలుపంచుకోవద్దని బెదిరించారని అన్నారు. రాత్రి 9.10 గంటల సమయంలో గౌరవ్ టికాయత్ కు పదేపదే ఫోన్లు వచ్చాయని, తనను బెదిరించారని, దూషించారని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, బెదిరింపు సందేశాలు పంపాడని పేర్కొన్నారు. ఫోన్ ఆఫ్ చేసి ఎంత దూరం పరిగెత్తుతారో చూస్తాం.. మిమ్మల్ని వదిలిపెట్టబోమని సందేశం పంపినట్టు తెలిపారు.