
PM Modi to visit Karnataka: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నెల 12న (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటకలో పర్యటించి.. 16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. బెంగళూరు-మైసూర్ ఎక్స్ ప్రెస్ వేను ఆయన ప్రారంభించడంతో పాటు మైసూరు-కుశాల్ నగర్ హైవేకు శంకుస్థాపన చేయనున్నారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు (మార్చి 12) కర్నాటకకు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో రూ.16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బెంగళూరు-మైసూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని ప్రారంభిస్తారు. బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాలంటే మూడు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఎక్స్ ప్రెస్ వే కారణంగా సమయం 75 నిమిషాలకు తగ్గనుంది. మైసూరు-కుశాల్ నగర్ మధ్య నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటీ ధార్వాడ్ ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 2019లో దీనికి శంకుస్థాపన చేశారు. శ్రీ సిద్ధరూద స్వామీజీ హుబ్లీ స్టేషన్ లో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫాంను కూడా పీఎం ఈ పర్యటనలో ప్రారంభిస్తారు.
ప్రధాని తన పర్యటనలో భాగంగా మార్చి 12న మధ్యాహ్నం 12 గంటలకు మాండ్యలో కీలకమైన రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు హుబ్బళి-ధార్వాడ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని అధికారిక ప్రకటన పేర్కొంది.
మాండ్యలో..
మౌలిక సదుపాయాల కల్పనను విస్తరిస్తూ, దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి కనెక్టివిటీ ఉండాలనే దార్శనికతతో ప్రధాని పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఎన్ హెచ్-275లోని బెంగళూరు-నిడఘట్ట-మైసూరు సెక్షన్ ను 6 లేన్లుగా, సుమారు రూ.8480 కోట్ల వ్యయంతో 118 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. దీంతో బెంగళూరు-మైసూరు మధ్య ప్రయాణ సమయం 3 గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గనుంది. ఇది ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
మైసూరు-కుషాల్ నగర్ 4 లేన్ల హైవేకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.4130 కోట్ల వ్యయంతో 92 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. బెంగళూరుతో కుశాల్ నగర్ కనెక్టివిటీని పెంచడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయాణ సమయాన్ని 5 నుండి 2.5 గంటలకు తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొంది.
హుబ్బళి-ధార్వాడ్ లో..
మార్చి 12న ఐఐటీ ధార్వాడ్ ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.850 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ సంస్థ ప్రస్తుతం 4 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిసిప్లినరీ 5 సంవత్సరాల బీఎస్-ఎంఎస్ ప్రోగ్రామ్, ఎంటెక్, పీహెచ్ డీ ప్రోగ్రామ్ లను అందిస్తోంది. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ను శ్రీ సిద్ధరూద స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్ లో ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. దీనిని ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 1507 మీటర్ల పొడవులో ప్లాట్ ఫాంను నిర్మించారు.