
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ అగ్నిపథ్ స్కీంపై మాట్లాడి మరో వివాదానికి తెర తీశారు. అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకించేవారు దేశద్రోహులు అని అన్నారు. అగ్నిపథ్ స్కీం ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు. ఈ స్కీంకు వ్యతిరేక వైఖరి తీసుకునే వారు దేశద్రోహులేనని పేర్కొన్నారు.
ఈ మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీంపై బీజేపీ ఎమ్మెల్యే బలమైన అభిప్రాయాలు చెప్పారు. ‘మనకు సైనికులు కావాలి. ఇజ్రాయెల్ దేశంలోనైతే.. ప్రతి కుటుంబం నుంచి ఒకరు పదేళ్లపాటు సైన్యంలో చేయడం తప్పనిసరి. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. కానీ, యావత్ ప్రపంచం మొత్తం ఆ దేశాన్ని గౌరవిస్తుంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇలాంటి టీమ్‌నే భారత్‌లోనూ తయారు చేయాలని అనుకున్నారు. అందుకే మనకు అగ్నిపథ్ స్కీం అవసరం’ వివరించారు.
ఈ స్కీం ఒక మతానికి, ఒక వర్గానికి వ్యతిరేకంగా లేదని స్పష్టం చేశారు. ‘మన దేశం అన్నం తిని పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసే వారే అగ్నిపథ్ స్కీం అంటే భయపడతారు. అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకించే వారు దేశద్రోహులే. నేను ఇది స్పష్టంగా చెబుతున్నాను’ అని తెలిపారు.
భారత సైన్యంలో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇది షార్ట్ సర్వీస్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ అగ్నిపథ్ స్కీం కింద సైన్యంలోకి నియామకమైన వారిని అగ్నివీరులుగా వ్యవహరిస్తారు. 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ స్కీం కింద సైన్యం చేరడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. వీరికి వేతంన రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఉంటాయి. మహిళలూ ఈ రిక్రూట్‌మెంట్ స్కీంకు అర్హులు.
అయితే, ఈ పథకాన్ని ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సైన్యంలోని కొందరు సీనియర్ అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను వెనక్కి తీసుకునేదే లేదని స్పష్టం చేసింది. వెంటనే ఈ స్కీం కింద రిక్రూట్‌మెంట్ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.