తమిళనాడులో నీట్‌కు మరొకరు బలి: ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్.. ‘‘ నీట్ ’’ రిజల్ట్‌పై బెంగ, సరిగా రాయలేదని

By Siva KodatiFirst Published Sep 15, 2021, 4:49 PM IST
Highlights

‘నీట్‌’కు తమిళనాడులో మరో విద్యార్థిని బలైంది. ఈ  పరీక్షలో ఫెయిలవుతానన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్రవ్యాప్తంగా నీట్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండడం, నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన ఉద్రిక్తతలు రేపుతోంది

‘నీట్‌’కు తమిళనాడులో మరో విద్యార్థిని బలైంది. ఈ  పరీక్షలో ఫెయిలవుతానన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్రవ్యాప్తంగా నీట్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండడం, నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన ఉద్రిక్తతలు రేపుతోంది. వివరాల్లోకి వెళితే... అరియలూరు జిల్లా సాత్తాంబాడి గ్రామంలో న్యాయవాది కరుణానిధి, జయలక్ష్మి దంపతులకు కయల్‌విళి (19), కనిమొళి (17) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. 

కయల్‌విళి పెరంబలూరులోని ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. అటు కనిమొళి ప్లస్‌-2 పరీక్షల్లో 562 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. డాక్టర్‌ కావాలనే ఆశతో నీట్‌ కోసం శిక్షణ కూడా పొందింది. ఆదివారం జరిగిన పరీక్షకు కనిమొళి హాజరైంది. తర్వాత ముభావంగా ఇంటికి తిరిగొచ్చింది. పరీక్షలో ప్రశ్నలు చాలా కఠినంగా వుండటంతో సరిగా రాయలేకపోయానని ఆమె తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వారు ఆమెకు ధైర్యం చెప్పారు. కానీ లాభం లేకపోయింది. 

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కనిమొళి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్రలేచిన కరుణానిధి.. దీనిని గమనించి, కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించినా కానీ అప్పటికే ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కనిమొళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక నీట్‌కు ముందు రోజు సేలం జిల్లా మేట్టూరు వద్ద ధనుష్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గడిచిన కొన్నేళ్లలో నీట్ వల్ల తమిళనాడులో 15 మంది విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

click me!