ఎయిర్‌పోర్టు అధికారులకు షాక్.. సాధ్వి లగేజీ బ్యాగ్‌లో మనిషి పుర్రె, అస్థికలు

By telugu teamFirst Published Sep 9, 2021, 3:59 PM IST
Highlights

ఓ సాధ్వి విమానాశ్రయ అధికారులకు ఊహించని షాక్ ఇచ్చారు లగేజీ బ్యాగులో మనిషి పుర్రె, అస్థికలు తీసుకెళ్లి ఖంగుతినిపించారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆమెను విచారించారు.

ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ విమానాశ్రయ అధికారులకు ఓ సాధ్వి షాక్ ఇచ్చారు. మనిషి పుర్రె, అస్థికలను ఓ బ్యాగ్‌లో భద్రంగా తీసుకెళ్లి ఖంగుతినిపించారు. ఇండోర్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఆమె ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఉజ్జయిన్ నుంచి బయల్దేరి వచ్చిన సాధ్వి యోగ్మాత తీరుపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లగేజీ స్కాన్నింగ్ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధ్వి బ్యాగ్‌నూ స్కాన్ చేయగా అనుమానాస్పదంగా తోచింది. బ్యాగ్ తెరవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఆమె బ్యాగ్ తెరిచారు. దీంతో ఖంగుతినడం అధికారుల వంతు అయింది. ఆ స్టాఫ్ వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి విషయం తెలియజేశారు. ఆ అస్థికలతో సాధ్విని విమానంలో ప్రయాణించడానికి అధికారులు నిరాకరించారు. పోలీసులకు విషయం చెప్పారు. 

సాధ్విని పోలీసులు విచారించారు. ఆ అస్థికలు తన దివంగత గురువులవని చెప్పినట్టు ఓ పోలీసు అధికారి వివరించారు. వాటిని హరిద్వార్ తీసుకెళ్లి గంగలో కలపాలని భావిస్తున్నట్టు చెప్పారని పేర్కొన్నారు.  

ఆ అస్థికలతో విమానంలో ప్రయాణించడానికి అనుమతులు లేకపోవడంతో అధికారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో వాటిని తోటి సన్యాసులకు అప్పగించారు. వారు వాటిని రోడ్డు ద్వారా హరిద్వార్‌కు వెళ్లగా, సాధ్వి మరో విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.

click me!