Stealth Omicronతో ఫోర్త్ వేవ్? కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే

Published : Mar 20, 2022, 08:16 PM IST
Stealth Omicronతో ఫోర్త్ వేవ్? కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే

సారాంశం

స్టెల్త్ ఒమిక్రాన్ ఇప్పుడు కొన్ని దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్నది. ఒక వేళ ఈ వేరియంట్ ప్రమాదవశాత్తు మన దేశంలోకి ఎంటర్ అయితే.. ఫోర్త్ వేవ్ వచ్చే ముప్పు ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టెల్త్ ఒమిక్రాన్ లక్షణాలపై చర్చ జరుగుతున్నది.

న్యూఢిల్లీ: జనవరి చివరి వారం నుంచి మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సుమారు నెల రోజుల వ్యవధి తర్వాత మళ్లీ కరోనా కేసుల పెరుగుదలకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మన పొరుగు దేశం చైనా మొదలు వియత్నాం, దక్షిణ కొరియాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ భయాలు మొదలవుతున్నాయి. ఆ దేశాల్లో ఎక్కువ కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌కు ఉప వేరియంట్‌గా పిలుస్తున్న బీఏ.2గా భావిస్తున్నారు. దీన్ని స్టెల్త్ ఒమిక్రాన్ అని పిలుస్తున్నారు.

స్టెల్త్ ఒమిక్రాన్ 1.5 రెట్లు ఒమిక్రాన్ కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉన్నదని డెన్మార్క్‌కు చెందిన స్టేటెన్స్ సీరం ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. మన దేశంలోకి ఈ స్టెల్త్ ఒమిక్రాన్ గనుక ప్రవేశిస్తే.. నాలుగో వేవ్ వచ్చే ముప్పు ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రజలు కొవిడ్ నిబంధనల అమలులో నిర్లక్ష్యంగా ఉండరాదని సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వేళ స్టెల్త్ ఒమిక్రాన్ మన దేశంలోకి ఎంటర్ అయితే.. దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే చర్చ మొదలైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, స్టెల్త్ ఒమిక్రాన్ కూడా ఒమిక్రాన్ తరహానే ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంటే.. ఊపిరితిత్తుల్లో కాకుండా.. గొంతుపై భాగంలోని శ్వాసవ్యవస్థపైనే దాని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. డెల్టా వేరియంట్ దిగువ శ్వాసవ్యవస్థ అంటే.. ఊపిరితిత్తులపై దాడి చేసింది. కాబట్టి, డెల్టా వేరియంట్ సమయంలో ఊపిరితిత్తుల్లోనే సమస్య ప్రధానంగా ఉండేది. అందుకే ఆక్సిజన్ అందని సమస్య కూడా ఎదురైంది.

స్టెల్త్ ఒమిక్రాన్ ఎగువ శ్వాసవ్యవస్థను ప్రభావితం చేస్తుంది కాబట్టి, అది ఎక్కువ ఫ్లూ లక్షణాలను కలిగి ఉండనుది. అంతేకానీ, డెల్టా సమయంలో కనిపించిన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవు. అలాగే, శ్వాస తీసుకోవడం ఇబ్బంది కూడా స్టెల్త్ ఒమిక్రాన్ లక్షణంగా ఉండదు.

అయితే, స్టెల్త్ ఒమిక్రాన్ లక్షణాలు ఇలా ఉంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందులో జ్వరం, తీవ్రమైన నీరసం, దగ్గు, గొంతు పొడిబారడం, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. అలాగే, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్లంతా పులిసినట్టు ఉండే లక్షణాలు స్టెల్త్ ఒమిక్రాన్ సోకితే కనిపిస్తాయని తెలుస్తున్నది.

స్టెల్త్‌ వేరియంట్‌ను అన్ని పరీక్షల్లో తేలికగా గుర్తించడం సాధ్యపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లోని కీలక ఉత్పరివర్తనాలను కోల్పోతుందని వారు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి వేగవంతమైన PCR పరీక్షలకు అవసరమని తెలిపారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కంటే Stealth Omicron తీవ్రత కలిగి ఉంటుందా..? లేదా..? అనే అంశాలను నిర్దారించడానికి ప్రస్తుతానికి సరిపడ డేటా లేదని నిపుణులు చెప్పారు. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో మాత్రం కరోనా ఇప్పుడే అంతం కాలేదని.. మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకురావొచ్చని హెచ్చరించింది. నిరక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.

ఇక, భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కూడా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, COVID-19 ప్రవర్తన’ అనే ఐదు దశల వ్యూహానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను శుక్ర‌వారం కోరింది. ఆగ్నేయాసియా, యూరప్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా జాగ్రత్తలు పాటించాలని  కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్  రాష్ట్ర కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?