
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రెండో సారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాలను డిజిటలైజ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సర్వీసులు రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయనుంది. ఒక్క క్లిక్‌తో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ఎలా పొందాలో తెలిపే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వివరిస్తున్న ఓ కథనాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను డిజిటల్ చేయనుంది అని ట్వీట్ చేశారు.
యోగి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలోని పంచాయతీలను డిజిటైజింగ్ చేయనుంది. ప్రభుత్వ పనుల్లో పారదర్శకతను డిజిటైజేషన్ నిలబెట్టనుంది. రోడ్డు నిర్మాణ పనుల గురించిన వివరాలనూ సులువుగా ప్రజలకు అందనున్నాయి. అంతేకాదు, చేతి పంపు ఏర్పాట్లు, టాయిలెట్ల పరిస్థితులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. డిజిటైజేషన్ ద్వారా గ్రామీణ యువత కూడా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూవర్లూ వారి వ్యాపారాలను విస్తరించుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. రాష్ట్రంలో 2,498 పంచాయతీ బిల్డింగులు ఉన్నాయి. అలాగే, 206 మల్టీ పర్పస్ పంచాయతీ బిల్డింగులు ఉన్నాయి. డిజిటల్ గ్రామాల్లో ఏటీఎం సేవలు, ఇంటర్నెట్ ఫెసిలిటీ, డెబిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్ పేమెంట్లు షాపుల్లో అందుబాటులోకి వస్తాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలూ డిజిటల్ చేయనున్నారు. రైతులకూ సాగు సంబంధ సమాచారం ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి రానుంది. రైతులకు ఈ-పాఠశాలను నిర్వహించనున్నారు. 45 వేల గ్రామ సభలను హై స్పీడ్ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారులు తెలిపారు.