
మణిపూర్ (manipur) రాష్ట్రంలో బీజేపీ (bjp) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టమైనప్పటికీ.. సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియడం లేదు. దీనిపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్.బీరెన్ సింగ్ (n biren singh)అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనే మళ్లీ సీఎంగా కొనసాగుతారని వార్తలు వెలువడినా.. ఇంకా ఈ విషయంలో స్పష్టత రావడం లేదు.
ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు దాటినా మణిపూర్ లో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కేవలం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ నుంచి సీఎం ఎవరు అనే విషయంలో గత కొంత కాలంగా పార్టీలో అంతర్గతంగా తర్జనాభర్జనా పడుతున్నారు. ఈ విషయంలో హైకమాండ్ ఏ విషయమూ తేల్చడం లేదు. తానే మళ్లీ సీఎంగా కొనసాగుతానని బిరేన్ సింగ్ ధీమాగా ఉన్నారు. కాగా తాజాగా మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు బీజేపీ సిద్ధాంతిక గురువు అయిన ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది.
గత అసెంబ్లీలో స్పీకర్ గా పని చేసిన ఖేమ్‌చంద్ సింగ్ (Khemchand Singh) కొత్త సీఎం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం ఖేమ్ చంద్ సింగ్ ను బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. అయితే గత కొంత కాలం నుంచి సీఎం అభ్యర్థిగా మణిపూర్ కు చెందిన ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు అపద్ధర్మ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కాగా.. మరొకరు బిస్వజిత్ సింగ్ (Biswajit Singh). అయితే వీరిద్దరి మధ్య ఉన్న అంతర్గత పోరును నివారించడానికి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న నాయకుడు హైకమాండ్ కు ఒక ఛాయిస్ గా మారారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజిజు నేడు మణిపూర్ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా.. ఆ పార్టీ 32 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ స్థానాలు పొందడం గమనార్హం. అయితే ఈశాన్య రాష్ట్రంలో వరుసగా రెండో సారి ఆ పార్టీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. అయితే మణిపూర్ లో సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందుగానే ప్రకటించకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా బీరెన్ సింగ్ ముందుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్ బీరెన్ సింగ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని, తదుపరి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ అనధికారికంగా ప్రకటించింది. హీంగాంగ్ నియోజకవర్గం నుంచి ఎన్ బీరెన్ సింగ్ 18,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ప్రస్తుతం బీరెన్ సింగ్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న బిస్వజిత్ సింగ్ బీజేపీ సీనియర్ లీడర్. బీరెన్ సింగ్ కంటే ఎక్కువ కాలం నుంచి బీజేపీలో ఉంటున్నారు. మరి సీఎం ఎవరనే విషయం క్లారిటీగా తెలియాలంటే మరి కొంత సమయం పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.