వందే భారత్ రైలుపై బెంగాల్ లో దాడి జరగలేదు.. తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చర్యలుంటాయ్- మమతా బెనర్జీ

By team teluguFirst Published Jan 5, 2023, 4:45 PM IST
Highlights

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై పశ్చిమ బెంగాల్ లో దాడి జరగలేదని, బీహార్ లో దాడి జరిగిందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తమ రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వ్యవహరించిన మీడియాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్ల దాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మీడియా సంస్థలకు గురువారం వార్నింగ్ ఇచ్చారు. హౌరా-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి జరిగింది తమ రాష్ట్రంలో కాదని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రమైన బీహార్ లో ఈ రాళ్ల దాడి జరిగిందని చెప్పారు. ఈ విషయంలో తమ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేలా నకిలీ వార్తలను  ప్రచారం చేసినందుకు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

‘‘ వందే భారత్‌ పై పశ్చిమ బెంగాల్‌లో రాళ్ల దాడి జరగలేదు. బీహార్ లో రాళ్లతో కొట్టారు. పశ్చిమ బెంగాల్‌లో ఘటన జరిగిందని, మా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేలా తప్పుడు వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని మమతా బెనర్జీ సాగర్ ద్వీపం నుండి బయలుదేరే ముందు మీడియాతో అన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదని, కేవలం అద కొత్త ఇంజన్ తో పునరుద్ధరించిన పాత రైలు అని అన్నారు. 

ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ప్రారంభించిన హౌరా-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జనవరి 3న రాళ్లు రువ్విన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రెండు కోచ్‌ల కిటికీలు దెబ్బతిన్నాయి. మరో ఘటనలో జనవరి 2న హౌరా-న్యూ జల్‌పైగురి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 22303 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నంబర్ C13 గ్లాస్ డోర్ దెబ్బతింది.

అయితే ఈ ఘటనలపై బీజేపీ స్పందిందిచింది. రాళ్ల దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ‘‘ ఈ ఘటన దురదృష్టకరం.. మమతా దీదీ ఆటవిక పాలనకు ఇదొక ఉదాహరణ. బెంగాల్‌లో ప్రతిరోజూ హింస, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి.. రాజకీయ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు.. వీటిపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.’’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ తెలిపారు.

కాగా.. దాడి జరిగిన రైలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కావడం గమనార్హం. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 30వ తేదీన శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రధాని తన తల్లి హీరాబెన్ ను కోల్పోయి, అంత్యక్రియలు నిర్వహించి మరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన తల్లికి సంప్రదాయబద్దంగా చేయాల్సిన అన్ని క్రతువులు పూర్తి చేసి, కొన్ని గంటల్లోనే ప్రధాని ఈ రైలును ప్రారంభించారు.

click me!