సొంత సంస్థకే కన్నం వేశాడో ఉద్యోగి. స్నేహితుడితో కలిసి ఆఫీస్ గోడౌన్ లో చోరీకి పక్కా ప్లాన్ చేశాడు. ఎవరికీ దొరకకుండా పరారయ్యాడు.
హర్యానా : గత నెలలో హర్యానాలోని గోహనాలోని ఫ్లిప్‌కార్ట్ కార్యాలయంలో రూ.21 లక్షల దోపిడీ జరిగింది. వివరాల ప్రకారం, తుపాకీతో వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. దీనిమీద దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ కేసులో మరో కొత్త విషయం వెలుగు చూసింది. దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో ఒకరు గతంలో ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి అని తేలింది. మేనేజర్ అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో.. తన స్నేహితుడితో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు.
గోహనాలోని సోనిపట్ రోడ్‌లోని కృష్ణ కాలనీలో ఈ దోపిడీ సంఘటన జరిగింది. ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం ఇక్కడ ఉంది. అక్టోబర్ 16న జరిగిన దోపిడీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా బయటపడ్డాయి. దీని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నవంబర్ 11న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
కర్ణాటకలో ‘‘పవర్’’ పాలిటిక్స్.. మాజీ సీఎం కుమారస్వామిపై విద్యుత్ చౌర్యం కేసు..
గోహనా డిసిపి భారతీ దబాస్ మీడియాతో మాట్లాడుతూ... ''నిందితులిద్దరూ స్నేహితులు. ఒకరి పేరు అనిల్ అలియాస్ టైగర్ కాగా మరొకరి పేరు లలిత్ అలియాస్ కాలు. ఇద్దరూ గోహనా వాసులు. విచారణలో, నెల రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ మేనేజర్ లలిత్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడైంది. దీంతో తీవ్రకోపానికి వచ్చిన లలిత్ తన స్నేహితుడు అనిల్‌తో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు.
దీపావళి సందర్భంగా భారీగా విక్రయాలు జరుగుతున్నాయని, గోడౌన్‌లో భారీగా డబ్బు ఉన్నట్లు నిందితులిద్దరికీ తెలిసిందని డీసీపీ తెలిపారు. ఎలాగైనా దోచుకోవాలని ఇద్దరూ ఈ ప్లాన్ వేశారు. ఈ పనిలో సందీప్ అనే వ్యక్తి కూడా పాల్గొన్నట్లు అధికారి తెలిపారు. అతని కోసం అన్వేషిస్తున్నారు. అనిల్ నుంచి మహీంద్రా కారు, బొమ్మ తుపాకీ, గొడ్డలి, రూ.7 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.7 లక్షల్లో నిందితులిద్దరూ తినడం కోసమే రూ.70 వేలు ఖర్చు చేశారని ఆయన చెప్పారు.