కర్ణాటకలో ‘‘పవర్’’ పాలిటిక్స్.. మాజీ సీఎం కుమారస్వామిపై విద్యుత్ చౌర్యం కేసు..

By Sumanth Kanukula  |  First Published Nov 15, 2023, 12:01 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరెంటు కొరతను సృష్టిస్తోందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.


కర్ణాటకలో ప్రస్తుతం పవర్(కరెంట్) పాలిటిక్స్ నడుస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరెంటు కొరతను సృష్టిస్తోందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. అలా ఆరోపించిన నెలరోజులలోపే హెచ్‌డీ కుమారస్వామి దీపావళి రోజున దొంగ విద్యుత్‌ను ఉపయోగించి తన ఇంటిని వెలిగించారని ఆరోపిస్తూ ఆయన కేసు నమోదైంది. బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (బెస్కామ్) ఫిర్యాదు మేరకు కుమారస్వామిపై ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు నమోదు కావడానికి ముందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు  చేసింది. బెంగళూరులోని జేపీ నగర్‌లోని కుమారస్వామి నివాసం వెలుపల ఉన్న స్తంభం నుంచి దీపావళికి ఏర్పాటు చేసిన అలంకరణ లైట్లకు అక్రమంగా విద్యుత్‌ను తీసుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది.  తమ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి పథకాన్ని అందిస్తోందని తెలిపింది. వారు గృహజ్యోతి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. అయితే ఈ పథకం కింద ఒక మీటరు మాత్రమే అనుమతించబడుతుందని ఆయనకు తెలియకపోవచ్చని పేర్కొంటూ సెటైర్లు వేసింది. 

Latest Videos

విలేఖరుల సమావేశం పెట్టి ‘‘కర్ణాటక అంధకారంలో ఉంది’’ అని చెప్పి.. ఇప్పుడు దొంగ కరెంటుతో మీ ఇంట్లో వెలుగులు నింపలేదా? అని కుమారస్వామిని ప్రశ్నించింది. రైతులకు అందాల్సిన కరెంటును ఆయన దొంగిలించారని ఆరోపించిన కాంగ్రెస్.. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు దీపావళి జరుపుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

అయితే ఈ విమర్శలపై కుమారస్వామి స్పందిస్తూ.. అనధికార కనెక్షన్‌కు ప్రైవేట్ డెకరేటర్‌ను నిందించారు. వెంటనే ఇంటి మీటర్ బోర్డుకు వైర్లను కనెక్ట్ చేయడం ద్వారా పరిస్థితిని సరిదిద్దామని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ కోసం చూస్తుందని ఆరోపించారు.‘‘దీపావళికి నా ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఓ ప్రైవేట్ డెకరేటర్‌ను అడిగాం. ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించి పక్కనే ఉన్న స్తంభం నుంచి విద్యుత్తును వినియోగించి పరీక్షించారు.. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే వైర్‌ను తీసివేయించి.. ఇంటి మీటర్ బోర్డుకు కనెక్ట్ చేయించాను. ఇది అసలైన వాస్తవం.  ఇందులో దాచాల్సింది ఏమి లేదు’’ అని కుమారస్వామి పేర్కొన్నారు.

కుమారస్వామి జరిగిన తప్పును అంగీకరించారు. బెస్కామ్ అధికారులు తనిఖీ కోసం తన ఇంటికి రావాలని, నోటీసు జారీ చేయాలని.. జరిమానా విధిస్తే చెల్లిస్తానని అన్నారు. ఆరోపణ చేసి ప్రచారం పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఆ పార్టీ చిల్లర మనస్తత్వం గురించి తాను ఆందోళన చెందుతున్నానని కుమారస్వామి అన్నారు.

click me!