
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంపుపై మంగళవారం సాయంత్రం బురఖా ధరించిన ఓ మహిళ బాంబు విసిరింది. ఈ దృశ్యాలు క్లియర్ గా అక్కడున్న సీసీ కెమెరాలకు చిక్కాయి. ఈ వీడియోను సీఆర్‌పీఎఫ్ విడుదల చేసింది.
ఈ సీసీటీవీ ఫుటేజీలో... ఓ వైపు నుంచి బుర్ఖా ధరించిన మహిళ నడుచుకుంటూ వస్తుంది. సరిగ్గా సీఆర్పీఎఫ్ క్యాంపు ముందర ఉన్న రోడ్డుపైన ఆగి, తన వద్ద ఉన్న బ్యాగ్ లోని బాంబుని హడావిడిగా తీసింది. ఆ తరువాత ఈ బాంబుని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై విసిరింది. అనంతరం అక్కడి నుంచి వేగంగా పారిపోయింది.
ఈ ఘటన భద్రతా శిబిరం వెలుపల జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
మహిళను గుర్తించి, ఆమె ఆచూకీ కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వీడియోలో ఉన్న మహిళను గుర్తించినట్టు, ఆమెను త్వరలో అరెస్టు చేస్తామని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.