ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలం మరో ఏడాది పొడిగించిన కేంద్రం

Published : Nov 18, 2022, 01:25 AM IST
ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలం మరో ఏడాది పొడిగించిన కేంద్రం

సారాంశం

NewDelhi: ఎస్‌కే మిశ్రా పదవీ విరమణకు ఒక రోజు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా ఒక సంవత్సరం పొడిగింపు పొందారు. ఫెడరల్ ఏజెన్సీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రాకి ఇది మూడో పొడిగింపు కావడం గమనార్హం.  

Enforcement Directorate SK Mishra: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు ఒకరోజు ముందు ఆయన పదవి కాలాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  డైరెక్టర్‌గా ఇది ఆయనకు ఐదవ సంవత్సరం. ఫెడరల్ ఏజెన్సీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రాకి ఇది మూడో పొడిగింపు కావడం గమనార్హం.


కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం పొడిగింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో లిస్టేడ్ కానున్నాయని సమాచారం. కేంద్ర జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో.. "ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని 18.11.2022 తర్వాత ఒక సంవత్సరం పాటు అంటే 18.11.2023 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు.. ఏది ముందు అయితే అప్పటివరకు పొడిగించడానికి క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది" అని పేర్కొన్నారు.

 

గతేడాది ఇదే క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా మిశ్రా పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం ఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదనీ, రాజకీయ నాయకులను, పౌర సమాజ సభ్యులను వేధిస్తున్నదని ఆరోపిస్తూ మిశ్రాకు ఇచ్చిన పొడిగింపుపై ప్రత్యర్థి పార్టీలు గతంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిశ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా నవంబర్ 19, 2018 న రెండేళ్ల స్థిర పదవీకాలానికి చేరారు. ఆ తర్వాత గతేడాది నవంబర్‌లో తొలిసారిగా ఏడాదిపాటు పొడిగింపు పొందారు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ నియామకం, పదవీకాలాన్ని నియంత్రించే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చట్టంలోని సెక్షన్ 25ను సవరిస్తూ గతేడాది కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ తన ప్రారంభ నియామకంతో సహా (రెండు సంవత్సరాల స్థిర పదవీకాలం) ఐదేళ్ల వరకు పొడిగింపు పొందవచ్చు, అయితే ప్రతి పొడిగింపు ఒకేసారి ఒక సంవత్సరం పాటు ఇవ్వబడుతుందని ఆర్డినస్ పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు