'ప్రతిపక్షం క్లీన్ అవుతోంది': కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

By Mahesh RajamoniFirst Published Nov 17, 2022, 11:48 PM IST
Highlights

Rahul Gandhi: పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రతిపక్షం క్లీన్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. 
 

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ.. "ప్రజలు ఈ యాత్ర అవసరమని భావిస్తున్నారు.. అందుకే వారు మాతో చేరడానికి ముందుకు వచ్చారు" అని అన్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రతిపక్షం క్లీన్ అవుతోందని పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ వీడి బీజేపీ చేరుతున్న అంశాన్ని ప్రస్తావించారు. 

నెల రోజుల పాటు 'భారత్ జోడో యాత్ర'లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. “ ₹ 10 కోట్లు, 50 కోట్లు ఆఫర్‌లు తీసుకొని బీజేపీ తరఫున పోటీ చేసే అవినీతి నాయకులు.. కాంగ్రెస్‌లోని అవినీతి దుర్వాసనను కడిగివేస్తున్నారంటూ" పేర్కొన్నారు. కాంగ్రెస్ ను వీడిబీజేపీలో చేరుతుండటం పై స్పందిస్తూ.. ప్రతిపక్షం క్లీన్ అవుతోందని అన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో హిమాచల్‌కు చెందిన 26 మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నేతలు ఎందుకు పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తున్నారనే విలేఖరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, "ఒక శివసేన ఎమ్మెల్యే తన పార్టీని వీడి బీజేపీలోకి రావడానికి ₹ 50 కోట్లు ఆఫర్ చేశారంటూ నా వెంట నడుస్తున్నాడు. అతను ఆఫర్‌ను తీసుకోలేదు, అయితే చాలా మంది ఇతరులు తీసుకున్నారు. అందుకే ఈ అవినీతి నేతలను వదిలేయడంతో ప్రతిపక్షాలు క్లీన్ అవుతున్నాయి. ఇది మంచి విషయమే, భారతదేశంలో కాంగ్రెస్‌లో చేరే నిజాయితీపరులకు కొరత లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. నవంబర్ 8న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ధరంపాల్ ఠాకూర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ నేగి, మాజీ కౌన్సిలర్ రాజన్ ఠాకూర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు అమిత్ మెహతా సహా 26 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి జంప్ అయ్యారు.

భారత్ జోడో యాత్రలో మహారాష్ట్ర  పాదయాత్ర నుండి నేర్చుకున్న విషయాలను కూడా పంచుకున్నారు. “నేను 14 రోజులు మీ రోడ్లపై నడిచాను. యువత తమ కష్టాలను నా ముందు చెప్పుకోగా, రైతులు తమ పోరాటాలను నా ముందు ఉంచారు. మరాఠా రాజు శివాజీ మహారాజ్, జ్యోతిరావ్ ఫూలే వంటి సంఘ సంస్కర్తల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న నాకు జ్ఞాన బహుమతి లభించింది”అని ఆయన అన్నారు.

"ఇది కేవలం కాంగ్రెస్, ఇతర పార్టీల మధ్య పోరు మాత్రమే కాదు. పత్రికలు, సంస్థలపై బీజేపీకి నియంత్రణ ఉంది.. అది న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. కాబట్టి రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు అనే ఈ దృక్పథాన్ని మార్చాలి, ఇది ఇతర విషయాలను చూసే ఉపరితలం. రాజకీయ నాయకులు విషయాలను ఎలా చూస్తారు.. దేశంలోని రైతులు, యువత విషయాలను ఎలా చూస్తారు అనే దాని మధ్య చాలా పెద్ద విభజన ఉంది”అని రాహుల్ గాంధీ అన్నారు. “మేము అన్ని మార్గాలను ప్రయత్నించాము, మేము నోట్ల రద్దు, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం లేదా చైనా సమస్యలకు సంబంధించి పార్లమెంటులో మా పాయింట్లను చెప్పడానికి ప్రయత్నించాము, కానీ మా మైక్ ఆఫ్ చేయబడింది. మాకు వినిపించడానికి వేరే మార్గం లేకపోవడంతో మేము యాత్ర ప్రారంభించాము. నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నాం" అని రాహుల్ గాంధీ అన్నారు.

click me!