
నాలుకకు సర్జరీ చేయించాలని ఓ రెండున్నరేళ్ల బాలుడిని తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడి డాక్టర్లు బాలుడికి సున్నతి (పురుషాంగం కొనను కప్పి ఉంచే చర్మాన్ని తొలగించడం) చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలోని ఎం ఖాన్ అనే ప్రైవేట్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిజా నిజాలను తేల్చేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్పిటల్ కు ఆరోగ్య శాఖ బృందాన్ని పంపింది.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ..10 మంది దుర్మరణం
ఈ ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ శనివారం స్పందించారు. ‘‘సున్నతి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్పిటల్ పై విచారణ జరిపేందుకు ఆరోగ్య శాఖ బృందాన్ని ఆసుపత్రికి పంపించాం. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.
ఈ ఆరోపణలు నిజమని తేలితే సున్నతి చేసిన సదరు డాక్టర్, హాస్పిటల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ను తక్షణమే రద్దు చేయాలని, ప్రొసీడింగ్స్ పూర్తి నివేదికను 24 గంటల్లో అందుబాటులో ఉంచాలని బరేలీలోని సీఎంఓకు ఆదేశాలు జారీ చేసినట్లు పాఠక్ తెలిపారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా సదరు హాస్పిటల్ ను సీజ్ కూడా చేస్తామని చెప్పారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన త్రిసభ్య దర్యాప్తు బృందం నివేదిక వచ్చిన తర్వాతే ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ శివకాంత్ ద్వివేది ఆదివారం తెలిపారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బల్బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లిదండ్రులు తమ బిడ్డ నాలుకకు సర్జరీ చేయాలని ఎం ఖాన్ హాస్పిటల్ కు వెళ్లారు. అయితే నాలుకకు ఆపరేషన్ చేయకుండా బాలుడికి సున్నతి చేశారు.
కాగా.. ఈ విషయంపై హిందూ హక్కుల సంఘాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనను అదుపు చేసేందుకు, మంటలు చెలరేగకుండా ఉండేందుకు ఆసుపత్రి వెలుపల పోలీసులను మోహరించారు.