కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న మూడు క్రిమినల్ చట్టాలు (3 criminal laws) న్యాయ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. కొత్త చట్టాలు శిక్ష కంటే న్యాయంపై ఎక్కువగా దృష్టి పెడుతాయని చెప్పారు.
3 criminal laws : మూడు క్రిమినల్ చట్టాలు న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. క్రిమినల్ చట్ట సవరణకు సంబంధించిన మూడు ముఖ్యమైన బిల్లులపై బుధవారం లోక్‌సభలో చర్చ జరిగింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- 1898, ఇండియన్ పీనల్ కోడ్ -1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష అధినియం అనే కొత్త బిల్లులను ఈ ఏడాది ఆగస్టులో లోక్ సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా లోక్ సభలో మిగిలిన సభ్యులనుద్దేశించి హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. భారతీయ శిక్షాస్మృతి స్థానంలో రానున్న భారతీయ న్యాయ సంహిత శిక్ష కంటే న్యాయంపై దృష్టి పెడుతుందని చెప్పారు. ప్రతిపాదిత మూడు క్రిమినల్ చట్టాలు ప్రజలను వలసవాద మనస్తత్వం, దాని చిహ్నాల నుండి విముక్తం చేస్తాయని ఆయన అన్నారు.
undefined
కాగా.. ఈ బిల్లులపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. కొత్త క్రిమినల్ బిల్లులు ఎవరిపై అయినా చర్యలు తీసుకునేలా పోలీసు అధికారాలను కల్పిస్తున్నాయని అన్నారు. దీని వల్ల ప్రజల పౌరహక్కులు, హక్కులకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఈ బిల్లులు దేశంలోని సామాన్య ప్రజలకు వ్యతిరేకమని ఒవైసీ అన్నారు.
ఈ చట్టాలు అమల్లోకి వస్తే ప్రజల హక్కులు హరించబడతాయని తెలిపారు. బీఎన్‌ఎస్‌లో చాలా ప్రమాదకరమైన నిబంధనలు ఉన్నాయని ఒవైసీ అన్నారు. ‘‘ఇవి పౌర హక్కులకు, హక్కులకు ముప్పు. ఇందులో ‘జడ్జి, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్’గా వ్యవహరించే అధికారాలను కూడా పోలీసులకు కల్పించారు. అంతే కాదు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో దేశద్రోహ నేరాన్ని వేరే రూపంలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా కనీస శిక్షను కూడా మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచారు.’’ అని అన్నారు.