ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఏఏ అమలుపై విమర్శలు చేశారు. భారత దేశ యువతకే బీజేపీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని, మరి అలాంటప్పుడు పాకిస్థాన్ నుంచి వచ్చిన యువతకు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.
సీఏఏ -2019ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫై చేసింది. దీంతో ఆ చట్టం ఆరోజు నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దీనిపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
ఈ సీఏఏ ఏంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘‘బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మూడు దేశాలకు చెందిన మైనారిటీలు భారత పౌరసత్వం పొందాలనుకుంటే, వారికి దానిని మంజూరు చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. అంటే పెద్ద సంఖ్యలో మైనారిటీలను మన దేశానికి రప్పిస్తారు. వారికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇళ్లు కట్టిస్తారు’’ అని అన్నారు.
undefined
భారత యువతకే బీజేపీ ఉద్యోగాలు కల్పించడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీ మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని, పాకిస్థాన్ కు చెందిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు. ‘‘మన దేశంలోని చాలా మంది ప్రజలకు ఇళ్లు లేవు. కానీ బీజేపీ పాకిస్తాన్ నుండి వచ్చిన వారిని ఇక్కడ స్థిరపరచాలనుకుంటోంది. మన ఉద్యోగాలను ఆ పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నారు. పాకిస్తానీయులను మన ఇళ్లలో స్థిరపరచాలని వారు కోరుకుంటున్నారు. మన కుటుంబాల అభివృద్ధికి, దేశాభివృద్ధికి వినియోగించాల్సిన భారత ప్రభుత్వ సొమ్మును పాకిస్థానీల సెటిల్ మెంట్ కోసం వినియోగిస్తామని చెబుతున్నారు’’ అని కేజ్రీవాల్ తెలిపారు
కాగా.. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు వచ్చిన ముస్లిమేతర వలసదారులకు త్వరితగతిన పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ సవరణ చట్టం-2019ను ప్రభుత్వం మార్చి 11న అమల్లోకి తెచ్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఈ మూడు దేశాల నుంచి హింసకు గురైన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వనున్నారు.