మీకు అవమానం జరిగితే మాతో వచ్చేయండి - నితిన్ గడ్కరీకి ఉద్ధవ్ ఠాక్రే ఆఫర్

By Sairam Indur  |  First Published Mar 13, 2024, 10:36 AM IST

బీజేపీలో అవమానం జరిగితే తమతో వచ్చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సూచించారు. మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పంపించడంలో ప్రతిపక్షాలన్నీ సహాయపడతాయని చెప్పారు.


బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే పలు సూచనలు చేశారు. బీజేపీ అవమానిస్తే ఆ పార్టీని వీడాలని, తమతో చేయాలని ఆయన గడ్కరీకి సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు మిమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. తూర్పు మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలోని పుసాద్లో జరిగిన ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మాజీ కాంగ్రెస్ నేత అయిన కృపాశంకర్ సింగ్ పై ఒకప్పుడు బీజేపీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిందని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. కానీ అలాంటి నేతకు బీజేపీ విడుదల చేసిన మొదటి లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చోటు దక్కిందని, కానీ అందులో గడ్కరీ పేరు కనిపించలేదని చెప్పారు. ఈ విషయాన్ని తాను రెండు రోజుల క్రితమే గడ్కరీకి చెప్పానని, మరోసారి చెబుతున్నానని అన్నారు. 

Latest Videos

‘‘మీకు అవమానాలు ఎదురైతే బీజేపీని వీడి మహా వికాస్ అఘాడీ (శివసేన), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ కూటమిలో చేరండి. మీ గెలుపును మేం చూసుకుంటాం. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిమ్మల్ని మంత్రిని చేస్తాం. అది అధికారాలతో కూడిన పదవి’’ అని అన్నారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేయడాన్ని ‘ఎన్నికల జుమ్లా(నినాదం)’గా ఠాక్రే అభివర్ణించారు.

పొరుగు దేశాల నుంచి భారత్ కు వచ్చే హిందువులు, సిక్కులు, పార్శీలు, ఇతరులను స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో నోటిఫికేషన్ వెలువడటమే అనుమానంగా ఉందని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి నాలుగేళ్లు దాటినా జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరగలేదని, కశ్మీరీ పండిట్లు ఇంకా కశ్మీర్ లోని తమ ఇళ్లకు తిరిగి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ముందుగా కశ్మీరీ పండిట్లను కశ్మీర్కు రప్పించి ఆ తర్వాత సీఏఏను అమలు చేయాలని ఠాక్రే అన్నారు.

కాగా.. గత వారం ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేయాలని గడ్కరీకి ఠాక్రే చేసిన ప్రతిపాదనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఉద్దవ్ ఠాక్రేను ఎగతాళి చేశారు. ‘‘ ఠాక్రే చేసిన ప్రతిపాదన ఎలా ఉందంటే.. వీధిలో నిలబడిన వ్యక్తి.. యూఎస్ అధ్యక్షుడిగా మారాలని ఒకరికి ఆఫర్ చేసినట్టు ఉంది..’’ అని అన్నారు. గడ్కరీ బీజేపీలో ప్రముఖ నాయకుడని, అయితే బీజేపీ, దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాల చర్చలు పూర్తి కానందున మొదటి జాబితాలో మహారాష్ట్ర నుండి పేర్లు లేవని ఫడ్నవీస్ చెప్పారు.

click me!