KTR VS Congress: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాని పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని ఈ సభ తారాస్థాయికి తీసుకెళ్లింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించిన తర్వాత.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు వరుసగా పెట్టి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శనివారం నాడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అనీ, రూ.50 లక్షలు చేతులు మారుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి.. వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాట్లాడుతూ సీఎంకు బదులు తెలంగాణలో ఒక రాజు ఉండేవారని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. స్పందిస్తూ తెలంగాణలో సీఎం లేడని, రాజు ఉన్నాడని ఎలా చెప్పారన్నది ఆసక్తికరంగా ఉందన్నారు. రాజు ఎవరు? తెలంగాణలో రాజు ఎవరైనా ఉంటే మీ పీసీసీ సభ్యుడు నీచమైన వ్యాఖ్యలు చేసినా స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తారా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీ ఒకే కుటుంబం చేతిలో అధికారాన్ని ఉంచిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆయన కాంగ్రెస్ ను విమర్శించారు. 'మోతీలాల్ నెహ్రూ నుంచి మీ వరకు దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మీ కుటుంబం అధికారంలో ఉంది. మీరు ఇక్కడకు వచ్చి మీరు కుటుంబం రాజకీయాలకు గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారని ప్రశ్నించారు. రైతు పక్షాన నిలిచే పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకు డీలా పడిందని కేటీఆర్ ప్రశ్నించారు. "మీరు ఇంతకు ముందు చెప్పని కొత్త మాట ఏదైనా మీ ప్రసంగంలో చెప్పారా? అని అన్నారు.
అలాగే, రాహుల్ గాంధీ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఏ పదవిలో వచ్చి తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాహుల్ మమ్మీ అధ్యక్షురాలని.. ఆయన డమ్మీ అని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఇండియాలో ఉంటాడో.. ఎప్పుడూ బయట ఉంటాడో తెలియదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ గాంధీ చదివారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నమ్మడానికి.. ఇది టెన్ జన్‌పథ్ కాదని మండిపడ్డారు. ఇది చైతన్యానికి ప్రతీక అయినా తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ గురించి తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసన్నారు.