న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తోపాటు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మార్కెట్‌లో నిమ్మకాయలు కొనాలంటే జంకుతున్నారు. ఒక్కో నిమ్మకాయ రూ. 10 పలుకుతున్నది. కిలోకు సుమారు రూ. 200 వరకు ఉన్నది. ఈ నేపథ్యంలో నిమ్మకాయల ఆధారంగా ఓ జైలు అధికారి చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఖైదీలకు అందించే రేషన్‌లో నిమ్మకాయల సంఖ్యను చేర్చాడు. ఖైదీలకు ఒక్క నిమ్మకాయ ఇవ్వకున్నా.. జైలు రికార్డుల్లో మాత్రం నిమ్మకాయలు భారీగా కొనుగోలు చేసినట్టు పేర్కొన్నాడు.
ఓ తనిఖీల బృందం జైలుకు వెళ్లింది. అక్కడ ఖైదీలనూ ఆ బృందం ఆరా తీయగానే ఈ నిమ్మకాయల స్కామ్ బయటకు వచ్చింది. తమ రేషన్‌లో ఒక్క నిమ్మకాయను కూడా పొందలేమని వారు చెప్పడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనంతరం పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ జైలు సూపరింటెండెంట్‌పై విచారణకు ఆదేశించారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గుర్నామ్ లాల్ అనే జైలు అధికారిని సస్పెండ్ చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు.
కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రాగానే ఏడీజీపీ (జైళ్లు) వీరేంద్ర కుమార్ ఇద్దరు అధికారులను ఆకస్మిక తనిఖీకి మే 1వ తేదీన పంపారు. ఆ టీమ్ కూడా మరిన్ని అవకతవకలను కనుగొంది. ఖైదీలకు అందించే ఆహారం నాణ్యత కూడా చాలా తక్కువ ఉన్నదని, సరిపాళ్లలో అందించడం లేదని తెలుసుకుంది. జైలు ఖైదీలకు అందించే చపాతీలు ఒక్కోటి 50 గ్రాములు కూడా లేదని, అంటే అక్కడికి సరఫరా అవుతున్న పిండిని దారి మళ్లిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.
జైలు ఖైదీల కోసం కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్న కూరగాయల ఎంట్రీల్లోనూ అవకతవకలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా, విజయవాడలో (vijayawada) షేర్ మార్కెట్ (share market) పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి ఏపీ వ్యాప్తంగా కోట్లు వసూలు చేసింది ఏఎన్‌వీఎస్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీ దగ్గర డబ్బులుంటే చాలు.. మేం కోటీశ్వరుల్ని చేస్తామంటూ అమాయకులకు వల వేసిన సంస్థ లాభానష్టాలతో సంబంధం లేకుండా లక్షకు 15 శాతం వడ్డీ ఇస్తామంటూ బాధితులకు కుచ్చుటోపీ పెట్టింది. దీంతో ఆశపడి చాలా మంది డబ్బులు కట్టారు. ఆ డబ్బుతో రాత్రికి రాత్రే ఊడాయించారు సంస్థ నిర్వాహకులు. లాభాలు ఇస్తామంటూ రూ.13 కోట్లతో పారిపోయారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వారం క్రితం పెనమలూరు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 420 కింద నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 30 మంది బాధితులు బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.