
పాట్నా: బిహార్‌లో ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ తదుపరి నాయకుడి ఎంపికపై చర్చ జరిగింది. ఈ రోజు బిహార్‌లో ఆర్జేడీ పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలు సహా పార్టీ చీఫ్ మార్పుపైనా చర్చ జరిగినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
బిహార్ మాజీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి అధికారిక నివాసంలో ఈ రోజు ఆర్జేడీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్‌కు కట్టబెడుతూ ఏకగ్రీవంగా పార్టీ నేతలు సమ్మతించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం రబ్రీ దేవి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్, పార్టీ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ, పార్టీ నేతలు దేవేంద్ర యాదవ్, రోషన్ పటేల్ యాదవ్, ఆర్జేడీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రామచంద్ర పూర్వె, తేజస్వీ యాదవ్, ఆర్జేడీ సుప్రీమ్ లాలు ప్రసాద్ యాదవ్‌లూ ఉన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై చర్చించడంతోపాటు అప్రకటిత పట్టాభిషేకం కూడా దాదాపు ఖరారైంది. ఈ సమావేశం అనంతరం మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే అలోక్ మెహతా మాట్లాడుతూ, తేజస్వీ యాదవ్ తమ నాయకుడు అని వెల్లడించారు. బిహార్ అసెంబ్లీలో ఆయనే అనేక అంశాలను లేవనెత్తుతున్నారని వివరించారు. బిహార్‌కు సంబంధించిన సమస్యలపై పార్టీ తరఫున ఆయనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కుల గణనకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకునే అధికారాన్ని అయినా తేజస్వీ యాదవ్‌కు ఈ సమావేశంలో అప్పగించారు. అంతేకాదు, రాష్ట్ర శాసన మండలి, రాజ్యసభకు నామినేషన్ వేసే అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని ఆయనకు పంచారు. లాలు యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ తేజస్వీ యాదవ్ ఆమోదం కూడా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం తరఫున తేజస్వీ యాదవ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక సమస్యలను లేవనెత్తుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు సైతం తేజస్వీ యాదవ్ సారథ్యంలోనే పార్టీ బరిలోకి దిగింది.
కొంత కాలంగా పార్టీలో అన్నదమ్ములు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌ల మధ్య ప్రచ్ఛన్నం యుద్ధం జరిగింది. కానీ, తేజస్వీ యాదవ్ వైపు లాలు ప్రసాద్ యాదవ్ మొగ్గు చూపారు. తాజాగా, ఆర్జేడీకి తేజస్వీ యాదవే నాయకత్వం వహిస్తారన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. త్వరలోనే ఆర్జేడీ పార్టీ నాయకత్వ బాధ్యతలు తేజస్వీ యాదవ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.