Rajya Sabha Election 2022: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల బీజేపీ ఇంచార్జ్‌గా కిషన్ రెడ్డి.. అక్కడ మూడో సీటు దక్కేనా?

Published : Jun 01, 2022, 05:30 PM ISTUpdated : Jun 01, 2022, 05:38 PM IST
Rajya Sabha Election 2022: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల బీజేపీ ఇంచార్జ్‌గా కిషన్ రెడ్డి.. అక్కడ మూడో సీటు దక్కేనా?

సారాంశం

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ తరఫున కిషన్ రెడ్డిని కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఇంఛార్జ్ గా నియమించింది. 

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ తరఫున కిషన్ రెడ్డిని కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమించింది. అదే విధంగా మరో మూడు రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికలకు కూడా కేంద్ర మంత్రులను ఇంచార్జ్‌లుగా నియమించింది. రాజస్థాన్‌కు నరేంద్ర సింగ్ తోమర్‌ను, హర్యానాకు గజేంద్ర సింగ్ షెకావత్‌ను, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్‌లను రాజ్యసభ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నిమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 

కర్ణాటక విషయానికి వస్తే.. 
దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు రాజస్థాన్, హర్యానా నుంచి ఒక్కో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడ నాలుగు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు స్థానాలు బీజేపీకి, ఒక్క స్థానం కాంగ్రెస్‌కు దక్కనుంది. మిగిలిన ఒక్క స్థానం ఎవరి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

నాలుగో స్థానానికి బీజేపీ, కాంగ్రెస్ జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థులను నిలిపినప్పటీ నుంచి.. ఏ పార్టీకీ దానిని గెలుచుకునే స్పష్టమైన సంఖ్య లేదు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోబోమని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఆ సీటు ఎన్నికపై ట్విస్ట్ చేసుకుంది. అయితే బీజేపీకి కొంతమేర అనుకూలించే అంశమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

కర్ణాటక అసెంబ్లీ మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థికి కనీసం 45 ఓట్లు కావాల్సి ఉంటుంది. అయితే 69 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపింది. సీనియర్‌ నేత, సిట్టింగ్ ఎంపీ  జైరాం రమేష్, రాజ్యసభ మాజీ ఎంపీ కె. రెహమాన్ కుమారుడు మన్సూర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ బరిలో నిలిపింది. మరోవైపు 121 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కన్నడ సినీ నటుడు జగ్గేష్‌లను తన ప్రాథమిక అభ్యర్థులుగా నిలబెట్టింది. మూడో అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు అయిన లహర్ సింగ్ సిరోయాను బరిలో నిలిపింది. ఇక, 32 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న జేడీఎస్  రియల్ ఎస్టేట్ వ్యాపారి డి కుపేంద్ర రెడ్డిని రంగంలోకి దింపింది. కుపేంద్ర గతంలో రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 

అయితే నాలుగో స్థానం విషయానికి వస్తే.. కాంగ్రెస్‌కు కేవలం 24 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో జేడీఎస్‌కు 32, BJPకి 31 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానిని ఏ పార్టీ దక్కించుకుంటుదనేది.. మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ లేదా రెండవ ప్రాధాన్యత ఓట్ల కోసం ఏదైనా రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలపై ఆధారపడి ఉండనుంది. బీజేపీ తరఫున నిలిచిన దాని ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఒక్కోక్కరికి.. 45 ప్రైమరీ ఓట్లను కేటాయించిన తర్వాత ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లభించడంతో మూడో అభ్యర్థి కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈలోపు ఏదైనా రాజకీయంగా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది వేచి చూడాల్సి ఉంది. మరి.. కర్ణాటకలో మూడు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్న వేళ.. కిషన్ రెడ్డి అక్కడ తనకు అప్పగించిన బాధ్యతలను ఏ విధంగా పూర్తిచేస్తారో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం