
Bengal : బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై తీవ్ర విమర్శలతో రెచ్చిపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు వంటి తప్పు నిర్ణయాలు దేశ ఆర్థిక వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయనీ, దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడానికి దారితీశాయని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను కేంద్రం తప్పుగా నిర్వహించడం వల్ల దేశం గోధుమల సరఫరాలో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు.
“కేంద్రం మాకు గోధుమలు అందించడం లేదు. పంపిణీ చేయడానికి తమ వద్ద గోధుమలు లేవని పేర్కొంది. దేశవ్యాప్తంగా గోధుమల కొరత ఉంది... కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది’’ అని బంకురా జిల్లాలో జరిగిన టీఎంసీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె అన్నారు. నోట్ల రద్దుపై కేంద్రంపై దాడి చేసి పశ్చిమ బెంగాల్‌కు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. “కేంద్రం మా డబ్బు మాకు ఇవ్వాలి లేకపోతే మేము బీజేపీకి గుడ్‌బై చెబుతాము. మీరు రాష్ట్రాలకు డబ్బు చెల్లించలేకపోతే, ఈ దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు” అని ఆమె అన్నారు. నోట్ల రద్దు తర్వాత "నగదు అంతా ఎక్కడికి పోయింది" అని బెనర్జీ ప్రశ్నించారు. నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణమని ఆరోపించారు. “నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణం. దాని ద్వారా మనం ఏం సాధించాం? నగదు అంతా ఎక్కడికి పోయింది?" అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
“రైల్వే, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి దేశ ఆస్తులను విక్రయించడంలో బీజేపీ బిజీగా ఉంది. ఈ విధంగా వారు ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నారు. దేశం చూసిన అత్యంత అసమర్థ పార్టీ అది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతే దేశానికి మేలు జరుగుతుంది" అని మమతా బెనర్జీ అన్నారు. అంతకుముందు కూడా మమతా బెనర్జీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. రాబోయే లోక్ సభ ఎన్నికలు 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదంటూ వ్యాఖ్యానించారు. అలాగే, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల కోసం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని ఆరోపించిన మమతా బెనర్జీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాదని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు శక్తివంచన లేకుండా పోరాడతానని ఆమె తెలిపారు. ''పురూలియా నేల, బెంగాల్ నేల ప్రజల కోసం పోరాడే శక్తినిచ్చాయి. నేను ఎవరికీ భయపడను మరియు ప్రజల సంక్షేమం విషయంలో నేను నా శక్తితో పోరాడతాను! 2024లో @BJP4India ద్వేషం & హింస రాజకీయాలకు భారతదేశంలో ప్రవేశం ఉండదు” అని మమత తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.