
ఇండోర్: మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ఆమె ఫెయిల్ అయినట్టు తెలుసుకుంది. ఇంటికి వెళ్లితే తల్లిదండ్రులు తిడతారని భయపడింది. వారి నుంచి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేసింది. తాను కిడ్నాప్ అయినట్టు కథ అల్లింది. అక్కడి నుంచి మరో నగరానికి చెక్కేసింది. తండ్రికి ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేసినట్టు చెప్పింది. తండ్రి పోలీసులను ఆశ్రయించి తన బిడ్డను అపహరించినట్టు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదంతా ఆ 17 ఏళ్ల బాలిక ప్లానే అని తేల్చారు.
ఇండోర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఆమెను కిడ్నాప్ చేసినట్టు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరీక్ష ఫలితాలు వెలువడ్డ తర్వాత కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా ఓ టెంపుల్ వద్ద నుంచి తన బిడ్డను కిడ్నాప్ చేసి పట్టుకెళ్లారని ఆరోపించాడు. ఆమెను పొరుగునే ఉండే 50 కిలోమీటర్ల దూరంలోని ఉజ్జయిన్ నగరంలో పట్టుకుని శనివారం తండ్రికి అప్పగించినట్టు ఇండోర్ బంగాంగ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ సోని తెలిపారు.
తన బిడ్డ తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పినట్టు తండ్రి వివరించాడు. ఫ్యాకల్టీ సభ్యులు ఒకరు తన బిడ్డను ఓ క్రాస్ దగ్గర డ్రాప్ చేశారని, అక్కడ ఆమె ఓ ఇ-రిక్షా ఎక్కిందని ఫోన్‌లో చెప్పిందని పేర్కొన్నాడు. ఆ డ్రైవర్ తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నోటిని క్లాత్‌తో మూసేయగానే మత్తుతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు తెలిపిందని చెప్పాడు.
Also Read: అయోధ్యలో హిందు ప్రాబల్య వార్డులో స్వతంత్ర ముస్లిం అభ్యర్థి గెలుపు.. స్థానికులు ఏమంటున్నారంటే?
పోలీసులు సీసీటీవీని పరిశీలించగా ఆ బాలిక చెప్పిన విషయాలు అబద్ధాలని పోలీసులు కనుగొన్నారు. ఇంతలోగా ఉజ్జయిన్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఒంటరిగా కూర్చున్న బాలిక ఫొటోతో ఈమె ఫొటోలు మ్యాచ్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను ఇండోర్‌కు తీసుకువచ్చి ఆమె బ్యాగ్‌ను చెక్ చేయగా ఇండోర్ నుంచి ఉజ్జయిన్‌కు బస్‌లో వెళ్లిన టికెట్, ఉజ్జయిన్ రెస్టారెంట్ బిల్లు కనిపించాయని వివరించారు. ఆ తర్వాత ఆమెకు మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
తాను బీఏ కోర్సు ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులకు సమాధానం చెప్పే పరిస్థితిలో తాను లేనని, అందుకే తాను కిడ్నాప్ అయినట్టు అబద్ధం చెప్పానని ఆ బాలిక తెలిపింది. లేదంటే తల్లిదండ్రులు తనను తిడతారని భయపడినట్టు పేర్కొంది.
ఆ తర్వాత బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.