
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గత మంగళవారం రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్ టీచర్లందరితో సమావేశం ఏర్పాటు చేశారు. పలు అంశాలను వారితో చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆ రిసార్ట్ లోనే వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే భోజనానికి ముందు అక్కడ ఒక విచిత్ర దృశ్యాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
సీఎంతో మీటింగ్ అయిపోయిన వెంటనే టీచర్లు డైనింగ్ హాలుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్లేట్లను పట్టుకోవడానికి పాట్లు పడ్డారు. ఆ ప్లేట్లు చుట్టూ ఒకే సారి టీచర్లు చేరిపోయారు. ప్లేట్లు వేగంగా లాక్కోవడం ప్రారంభించారు. అయితే దీనిని గమనించిన ఓ సూట్ ధరించిన వ్యక్తి వాటని పక్కకు తీసుకెళ్లాడు. బహుషా ఆయన ఆ రిసార్టులో ఉన్న ఉద్యోగి కావచ్చు. ఆయన ప్లేట్లను చేతితో తీస్తూ ఒక్కొక్కటిగా అందరికీ పంపిణీ చేయడం ప్రారంభించాడు. అయినా కూడా ఆయన వద్ద నుంచి వేగంగా ఆ ప్లేట్లను లాక్కున్నారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో విపరీతంగా ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఓ యూజర్ ‘మైన్‌సాబో ముర్గా బనావో (కోడిలా కూర్చోమని చెప్పండి)' అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ‘‘ భోజనం ఏ సమయంలో వడ్డించారో నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఎందుకంటే వారు చాలా ఆకలితో ఉన్నట్లు కనిపిస్తున్నారు ’’ అని మరో యూజర్ పేర్కొన్నారు. ‘‘ కొన్ని ప్రాథమిక ‘సివిక్ సెన్స్’ శిక్షణ కోసం వారిని నిజంగా ‘హేవార్డ్’కు పంపాల్సిన అవసరం ఉంది ’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
టీచర్లను సమావేశం జరిగే ప్రదేశానికి తీసుకొచ్చేందుకు పంజాబ్ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఉపాధ్యాయుల సూచనలను వినేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ తెలిపారు. విద్యా సంస్కరణలను ‘‘అవుట్ ఆఫ్ ది బాక్స్’’ తీసుకురావడానికి టీచర్ల నుంచి సలహాలు, వారి ఆలోచలను స్వీకరించడానికి సీఎం భగవంత్ మాన్ ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించారు.
సంప్రదాయ విద్యా విధానాన్ని మార్చడానికి, కాగిత రహిత, డిజిటల్ సాధికారతకు ఉపయోగపడే విధంగా టీచర్లు ఈ పోర్టల్ ద్వారా తమ సలహాలు, సూచనలు అందించాలని సీఎం కోరారు. ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్రంలో పరిశ్రమలను తిరిగి తీసుకురావడం ద్వారా ‘‘బ్రెయిన్ డ్రెయిన్ ’’ను ఆపడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భగవంత్ మాన్ చెప్పారు. ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను పంజాబ్ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఆయన తెలిపారు.